కొలీజియం సిఫార్సు చేసిన జడ్జీల నియామకాలపై కేంద్రం అనుసరిస్తున్న తీరు పట్ల సుప్రీంకోర్టు అంసతృప్తి వ్యక్తం చేసింది. జడ్జీల నియామక ప్రక్రియకు గడువు విధించి.. ఆలోపే పుర్తి చేయాలని సూచించింది. జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ ఏఎస్ ఒకతో కూడిన ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది. నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ (ఎన్జేఏసీ) చట్టం విషయంలో కేంద్రం అసంతృప్తితో ఉందని అర్థమవుతోందని వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు. అయితే.. కొలీజియం సిఫార్సులు ఆమోదించడంలో జాప్యానికి ఇది కారణం కారాదని అభిప్రాయపడింది. కొలీజియం సిఫార్సులను జాప్యం చేస్తున్నారంటూ బెంగళూరు బార్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా సోమవారం ఈ వ్యాఖ్యలు చేసింది. న్యాయవ్యవస్థ స్వతంత్రతను కేంద్రం దెబ్బ తీస్తోందని ఆ వ్యాజ్యంలో పిటిషనర్లు ఆరోపించారు.
జడ్జీల నియామకానికి సిఫార్సు చేసేముందు కొలీజియం అనేక విధాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని సుప్రీంకోర్టు వివరించింది. కొలీజియం అనేక సార్లు సిఫార్సు చేసినా జడ్జీల నియామకం జరగలేదని అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణికి గుర్తు చేసింది. గత రెండు నెలలుగా కొలీజియం సిఫార్సులు యధాతథంగానే ఉన్నాయని.. వీలైనంత త్వరగా పరిష్కరించాలని సూచించింది. న్యాయవ్యవస్థే చర్యలు తీసుకునేలా చేయొద్దని హెచ్చరించింది. ఈ కేసు తదుపరి విచారణను డిసెంబర్ 8కి వాయిదా వేసిన కోర్టు.. అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్ ఇద్దరూ హాజరు కావాలని ఆదేశించింది.