పెగసస్ నిఘా వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం తీర్పు ఇవ్వనుంది. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమాకోహ్లీతో కూడిన ధర్మాసనం ఈ కేసుపై వాదనలు విని సెప్టెంబర్ 13న తీర్పును రిజర్వు చేసింది. పౌరులపై నిఘా పెట్టేందుకు కేంద్రం పెగసస్ స్పైవేర్‌ను అక్రమ విధానంలో ఉపయోగించిందా? లేదా? అనే విషయాన్ని మాత్రమే తాము తెలుసుకోవాలనుకుంటున్నట్లు ఆ రోజు పేర్కొంది.
అయితే పెగసస్ వ్యవహారంపై పూర్తి స్థాయిలో వివరాణాత్మక అఫిడవిట్ సమర్పించాలని సుప్రీంకోర్టు సూచించగా.. కేంద్రం అందుకు నిరాకరించింది. భద్రతా కారణాల దృష్ట్యా పూర్తిస్థాయి ప్రమాణ పత్రం దాఖలు చేయలేమని పేర్కొంది. ఇప్పటికే సమర్పించిన అఫిడవిట్ సరిపోతుందని చెప్పింది. ఈ వ్యవహారంపై ప్రభుత్వ అధికారులు లేకుండా నిపుణలతో కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపింది.
జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలు అఫిడవిట్లో చెప్పాల్సిన అవసరం లేదని, పెగసస్‌పై కేంద్రం వైఖరి ఏంటో తెలుసుకోవడమే తమ ఉద్దేశమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ పెగసస్‌తో పౌరులపై నిఘా పెడితే అది చట్టానికి లోబడే ఉండాలని తేల్చిచెప్పింది. ఈ వ్యవహారంలో నిజానిజాలు తేల్చేందుకు అవసరమైతే తామే సాంకేతిక నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తామని సర్వోన్నత న్యాయస్థానం సూచనప్రాయంగా చెప్పింది. దీంతో బుధవారం తీర్పు ఎలా ఉండబోతుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.