"ఇప్పటికే నగరం పీక పిసికారు. ఇప్పుడు నగరం మధ్యలోకి వచ్చి ఆందోళన చేస్తామంటున్నారు.." అంటూ శుక్రవారం సుప్రీంకోర్టు రైతు సంఘంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జంతర్‌మంతర్‌లో 200 మంది రైతులతో శాంతియుతంగా సత్యాగ్రహం చేయడానికి అనుమతించాలని కోరుతూ కిసాన్ మహాపంచాయత్ చేసిన వినతిని పరిశీలిస్తూ ఈ వ్యాఖ్య చేసింది. దీనిని జస్టిస్ ఎ.ఎం.ఖాన్విల్కర్, జస్టిస్ సి.టి.రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణకు స్వీకరించింది. ఈ సందర్భంగా సాగిన వాదనలిలా...
ధర్మాసనం:ఆ మూడు చట్టాలను రద్దు చేయాలన్నదే మీ సమస్య. దీనిపై హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. కోర్టును ఆశ్రయించిన తరువాత ఆందోళన కొనసాగించడంలో అర్ధం లేదు. మీరు న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారా?
న్యాయవాది:లేదు
ధర్మాసనం:న్యాయవ్యవస్థను ఆశ్రయించిన తరువాత కోర్టుపై విశ్వాసం ఉంచండి. ఆందోళన చేసే బదులు అత్యవసరంగా విచారించాలని కోర్టును కోరండి. ఆందోళన చేయడం పౌరుల హక్కే. అదే సమయంలో స్వేచ్ఛగా, నిర్భయంగా తిరిగే హక్కు కూడా ఇతరులకు ఉంది. పౌరుల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. ఆందోళనతో సంతోషంగా ఉన్నామంటూ చుట్టుపక్కల వారి నుంచి ఏమైనా ధ్రువపత్రం తీసుకున్నారా?
న్యాయవాది:రైతులు శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారు.