ఈ కోర్టు తీర్పులను గౌరవించకూడదని వారు నిర్ణయించుకున్నట్లు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ట్రైబ్యునళ్ల (Tribunals Supreme Court) విషయంలో మీరెందుకు ఇలా ఉన్నారన్నది అర్థం కావడంలేదు. వాటిని వద్దనుకుంటున్నారా? తీర్పును గౌరవించకపోతే ఎలా?
ట్రైబ్యునళ్లపై విచారణ సందర్భంగా కేంద్ర వైఖరిని తూర్పారబడుతూ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఉద్దేశించి జస్టిస్ ఎన్.వి. రమణ(CJI Ramana) ధర్మాసనం చేసిన వ్యాఖ్యలివి.
దేశంలో వివిధ ట్రైబ్యునళ్లలోని ఖాళీల భర్తీ విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రదర్శిస్తున్న తాత్సార వైఖరిపట్ల సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. మద్రాస్ బార్ అసోసియేషన్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా కేంద్రం 'ట్రైబ్యునళ్ల సంస్కరణల చట్టం- 2021' (Tribunals Reforms Bill 2021) ని తీసుకురావడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ లావు నాగేశ్వరరావులతో కూడిన ప్రత్యేక ధర్మాసనం ప్రభుత్వ తీరును తూర్పారబట్టింది. ఈ అంశంలో కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవడం, లేదంటే ట్రైబ్యునళ్లను మూసేయడం తప్ప మరో గత్యంతరం లేకుండా ప్రభుత్వ వ్యవహారశైలి ఉందని వ్యాఖ్యానించింది. ట్రైబ్యునళ్ల తరలింపు, సభ్యుల నియామకం, గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా ప్రభుత్వం చేసిన కొత్త ట్రైబ్యునల్ సంస్కరణ చట్టాన్ని సవాల్ చేస్తూ దిల్లీ బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ ఆఫ్ మధ్యప్రదేశ్, రాజ్యసభ సభ్యుడు జైరాం రమేశ్ దాఖలు చేసిన పిటిషన్లపై సోమవారం ధర్మాసనం విచారణ చేపట్టింది.
రెండు వారాల్లో చర్యలు : కేంద్రం
కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. 'కేంద్రం కొత్తగా చేసిన 2021 ట్రైబ్యునళ్ల సంస్కరణల చట్టం.. ఖాళీల భర్తీకి మార్గం సుగమం చేసింది. ఎంపిక సంఘం సిఫార్సు చేసిన చోట్ల కార్యాచరణ మొదలైంది. నియామకాలపై ఇంతవరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వచ్చే రెండు వారాల్లో కేంద్రం తప్పనిసరిగా చర్యలు తీసుకుంటుంది' అని చెప్పారు. మొదటి నుంచీ ఈ కేసును అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ చూస్తున్నారని, వ్యక్తిగత ఇబ్బందుల దృష్ట్యా ఆయన హాజరు కాలేకపోతున్నందున కేసును వాయిదా వేయాలని కోరారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమణ అందుకు నిరాకరించారు. 'ఇదివరకు మేం వాదనలను సుదీర్ఘంగా విని ఉత్తర్వులు జారీచేశాం. కానీ అమలు చేయలేదు. ఈ కోర్టు వెలువరించే తీర్పులపై మీకు గౌరవం లేదు. కోర్టుల సహనానికి పరీక్ష పెడుతున్నారు. కొంతమందిని నియమించినట్లు క్రితంసారి మీరు తెలిపారు. ఎంతమందిని నియమించారో చెప్పండి' అని సొలిసిటర్ జనరల్‌ను జస్టిస్ రమణ ప్రశ్నించారు.
కొన్ని మూతపడే దిశలో ఉన్నాయి
జస్టిస్ లావు నాగేశ్వరరావు స్పందిస్తూ 'ఇదివరకు ఉన్న చట్టాన్ని దృష్టిలో ఉంచుకొని ట్రైబ్యునళ్ల ఖాళీల భర్తీ కోసం ఏడాదిన్నర క్రితమే సిఫార్సులు చేశాం. అందుకు సంబంధించి ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరాలు ఉండకూడదు. అయినప్పటికీ ఎందుకు నియామకాలు చేపట్టలేదు? ప్రస్తుతం కొన్ని ట్రైబ్యునళ్లు మూతపడే దిశలో ఉన్నాయి. మరికొన్ని ఒకే సభ్యుడితో నడుస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తెచ్చిన కొత్త చట్టం ప్రకారం నియామకాలు చేస్తామని చెబుతోంది. కానీ ఇదివరకున్న చట్టం ప్రకారం సిఫార్సులు చేశాం' అని గుర్తుచేశారు. కంపెనీ లా ట్రైబ్యునల్, వినియోగదారుల పరిష్కార కమిషన్‌లోని ఖాళీల పట్ల జస్టిస్ చంద్రచూడ్ తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలను జస్టిస్ లావు నాగేశ్వరరావు సమర్థించారు. 'ట్రైబ్యునళ్లు పనిచేయకపోవడంవల్ల ఆ భారం అంతా కోర్టుల మీద పడుతోంది. నియామకాలు చేపట్టకుండా ట్రైబ్యునళ్లను మీరు నిర్వీర్యం చేస్తున్నారు' అని ఆయన కేంద్రాన్ని ఉద్దేశించి పేర్కొన్నారు.