వివాహ చట్టాల్లోని పలు నిబంధనలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను ముఖ్యమైన వ్యాజ్యాలుగా అభివర్ణించింది సుప్రీంకోర్టు. విడిపోయిన భార్యాభర్తల దాంపత్య హక్కులను పునరుద్ధరించడం కోసం.. ఇరువురు 'కలిసి ఉండాలి, లైంగిక జీవితం సాగించాలి' అని ఆదేశించే అధికారం న్యాయస్థానాలకు కల్పిస్తున్న నిబంధనల రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ ఈ పిటిషన్లు దాఖలయ్యాయి.
దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీఆర్ గవాయ్‌తో కూడిన ధర్మాసనం.. ఈ అంశంపై పది రోజుల్లోగా స్పందించాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది.
గోప్యత ఉల్లంఘన?
హిందూ వివాహ చట్టం(హెచ్ఎంఏ)లోని సెక్షన్ 9, ప్రత్యేక వివాహ చట్టం సెక్షన్ 22లను సవాల్ చేస్తూ ఈ వ్యాజ్యాలు దాఖలయ్యాయి. పిటిషనర్ల తరపున వాదనలు వినిపించిన అడ్వకేట్ షోయెబ్ ఆలం.. వివాహ చట్టాలతో పాటు ఐపీసీలోని పలు నిబంధనలను సైతం పరిశీలించాల్సిన అవసరం ఉందని అన్నారు. గోప్యతా హక్కుపై తొమ్మిది మంది సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును ప్రస్తావించారు.