ప్రభుత్వం మారినప్పుడల్లా రాజద్రోహం కేసులు నమోదు చేయడం ఆందోళనకర పరిణామంగా మారిందని గురువారం సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న ఛత్తీస్‌గఢ్ పోలీసు ఉన్నతాధికారిని రాజద్రోహం కేసు కింద అరెస్టు చేయకుండా ఊరట కలిగిస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం పై వ్యాఖ్య చేసింది.
"చట్టాన్ని (రూల్ ఆఫ్ లా) పాటిస్తే ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నం కావు. ఏదైనా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దానికి అనుకూలంగా వ్యవహరిస్తే తర్వాత (పోలీసులకు) సమస్యలు వస్తాయి. దేశంలో పరిస్థితులు విచారకరంగా ఉన్నాయి. ఓ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పోలీసు అధికారులు ఆ పార్టీ వైపు ఉంటున్నారు. ఆ తరువాత కొత్త పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆ ప్రభుత్వం ఆయా పోలీసు అధికారులపై చర్యలు తీసుకుంటోంది. పోలీసులు అధికార పార్టీ వైపు ఉన్నప్పుడు రాజద్రోహం కేసులు ఉండడం లేదు. ఆ పార్టీ మారగానే రాజద్రోహం కేసులు పెడుతున్నారు. దేశంలో ఇదో కొత్త పోకడ. దీనిని ఆపాల్సి ఉంది."
-- జస్టిస్ ఎన్.వి.రమణ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే...1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన గుర్జీందర్ పాల్ సింగ్ ఛత్తీస్‌గఢ్‌లో భాజపా అధికారంలో ఉన్నప్పుడు రాయ్‌పుర్, దుర్గ్, బిలాస్‌పుర్‌ల్లో ఐజీగా పనిచేశారు. ప్రస్తుతం అదనపు డీజీపీ హోదా పోలీసు అకాడమీ డైరెక్టర్‌గా ఉన్నారు. కేసుల కారణంగా సస్పెండయ్యారు. ప్రభుత్వం మారిన అనంతరం అవినీతి నిరోధక శాఖ, ఆర్థిక నేరాల విభాగం సోదాలు జరిపి ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్టు కేసు నమోదు చేసింది. వివిధ వర్గాల మధ్య విభేదాలు కలిగేలా వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారంటూ రాజద్రోహం కేసు కూడా నమోదయింది. రాజద్రోహం కేసును కొట్టివేయాలంటూ తొలుత ఆయన హైకోర్టును ఆశ్రయించగా అనుకూలంగా ఉత్తర్వులు రాలేదు. దాంతో సుప్రీంకోర్టులో అప్పీలు చేయగా రెండు కేసుల్లోనూ నాలుగు వారాల పాటు ఎలాంటి అరెస్టు చేయకూడదంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దర్యాప్తునకు సహకరించాలని సింగ్‌కు సూచించింది.