బక్రీద్ పండుగ నేపథ్యంలో రాష్ట్రంలో ఆంక్షలను సడలిస్తూ కేరళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా కేసులు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లోనూ ఈ సడలింపులు చేయడం అనవసరమని వ్యాఖ్యానించింది. ఈ నిర్ణయంతో ప్రభుత్వం.. మహమ్మారికి ప్రజల ప్రాణాలు పణంగా పెడుతోందని పేర్కొంది. కేరళ ప్రభుత్వ సడలింపులపై దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు మంగళవారం ఈ వ్యాఖ్యలు చేసింది.
'అదే జరిగితే చర్యలు తప్పవు'
వ్యాపారుల ఒత్తిడికి లొంగి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం సరికాదని జస్టిస్ ఆర్ఎఫ్ నారీమన్, జస్టిస్ బీఆర్ గవాయ్‌తో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. జీవించే హక్కు గురించి పేర్కొంటూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ను ప్రభుత్వం గమనించాలని సూచించింది. ఈ ఆంక్షల సడలింపు వైరస్ వ్యాప్తిపై ప్రభావం చూపిస్తే.. దానిపై ఎవరైనా కేసు దాఖలు చేయవచ్చని స్పష్టం చేసింది. పిటిషన్‌ను పరిశీలించి ప్రభుత్వంపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమని హెచ్చరించింది.
ఇదీ చదవండి :భారత్‌లో తొలి డబుల్ ఇన్ఫెక్షన్ కేసు