చట్టసభల్లో సభ్యుల ప్రవర్తనపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పార్లమెంట్ సహా రాష్ట్రాల అసెంబ్లీల్లో శాసనసభ్యులు అనుచితంగా ప్రవర్తించడం ఈ మధ్య ఎక్కువైపోయిందని వ్యాఖ్యానించింది. ఇది క్షమార్హం కాదని పేర్కొంది. సభ్యుల వికృత ప్రవర్తనపై కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది.
2015లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేరళ అసెంబ్లీలో జరిగిన ఘర్షణకు సంబంధించి దాఖలైన క్రిమినల్ కేసుపై వాదనలు విన్న ధర్మాసనం.. సభ మర్యాదను తప్పక కాపాడాలని వ్యాఖ్యానించింది. ఈ సభలను ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే వేదికలుగా అభివర్ణించింది.
"సభలో మైకులు విసరడం, ప్రజా ఆస్తులను ధ్వంసం చేయడం వంటివి చేసే ఎమ్మెల్యేల ప్రవర్తనను మేం క్షమించం. వారు ప్రజా ప్రతినిధులు. ఇలా చేయడం ద్వారా ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారు. దీనిపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. లేదంటే ఇలాంటి ప్రవర్తనకు అడ్డుకట్ట పడదు. ఇలా ప్రవర్తించే వారిపై ప్రజా ఆస్తుల నష్ట నివారణ చట్టం కింద చర్యలు తీసుకోవాలి."
-సుప్రీంకోర్టు