ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీ కూల్చివేతల అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రైల్వే భూమిలో అక్రమ కట్టడాలను కూల్చివేయాలంటూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది. ఇలాంటి కేసుల్లో మానవీయ కోణాన్ని కూడా చూడాలని.. రాత్రికి రాత్రే 50వేల మందిని వెళ్లగొట్టకూడదని స్పష్టం చేసింది.
హల్ద్వానీలోని బన్‌భూల్‌పురా ప్రాంతంలో 29 ఎకరాల భూమి తమదేనని రైల్వేశాఖ గతేడాది కోర్టుకెక్కింది. ఈ విశాల స్థలంలో స్థానికులంతా అక్రమంగా ఇళ్లు నిర్మించుకున్నారని, వారిని ఖాళీ చేయించాలంటూ ఉత్తరాఖండ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఆ స్థలంలో కట్టిన అక్రమ కట్టడాలను కూల్చివేయాలంటూ గతేడాది డిసెంబరు 20న తీర్పు వెలువరించింది. దీనిపై వారం రోజుల ముందు నోటీసులు ఇవ్వాలని, ఆ తర్వాత కూల్చివేతలు మొదలుపెట్టాలని ఆదేశించింది.
రైల్వేశాఖ పేర్కొంటున్న స్థలంలో 4,365 కట్టడాలు ఉన్నాయి. ఇక్కడ నాలుగు వేలకు పైగా కుటుంబాలు నివాసముంటున్నాయి. ప్రార్థనా మందిరాలు, స్కూళ్లు, వ్యాపార సముదాయాలు కూడా ఉన్నాయి. హైకోర్టు తీర్పుతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన స్థానికులు.. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గురువారం విచారణ జరిపిన జస్టిస్ ఎస్.కె. కౌల్, జస్టిస్ ఎ.ఎస్ ఓకా ధర్మాసనం.. హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించింది.