వ్యక్తిగత వినియోగం నిమిత్తం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లపై(Oxygen Concentrator) సమీకృత వస్తుసేవల పన్ను (ఐజీఎస్టీ) విధించడం రాజ్యాంగ విరుద్ధమంటూ.. దిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు నిలిపేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంతవరకూ ఇది అమలులో ఉంటుందని తెలిపింది. ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యంపై జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ ఎం.ఆర్.షాల ప్రత్యేక ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది.
కొవిడ్ బాధితుడైన ఓ వ్యక్తి- "నా దయనీయ పరిస్థితి చూసి విదేశంలో ఉన్న మేనల్లుడు వ్యక్తిగత వినియోగం నిమిత్తం ఆక్సిజన్ కాన్సంట్రేటర్‌ను(Oxygen Concentrator) బహుమతిగా పంపాడు. కానీ, ప్రభుత్వం దానిపై 12% ఐచ్కీజీజిఎస్టీ విధించింది! ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత నెలకొన్న తరుణంలో కొవిడ్ బాధితులు బతకడానికి ఇది ఎంతో అత్యవసరం. దీనిపై పన్ను వేయడమంటే జీవించే ప్రాథమిక హక్కుకు భంగం కలిగించడమే" అంటూ హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం గత నెల 21న తీర్పు వెలువరించింది. సొంతంగా వాడుకోవడానికి దిగుమతి చేసుకునే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లపై పన్ను విధించడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. దీన్ని కేంద్ర ఆర్థికశాఖ రెవెన్యూ విభాగం సుప్రీంకోర్టులో సవాలు చేసింది.