కుల ధ్రువీకరణ పత్రం పొందటంలో అక్రమాలకు పాల్పడ్డారన్న కేసులో మహారాష్ట్ర అమరావతి ఎంపీ నవనీత్ కౌర్‌కు ఊరట లభించింది. ఆమె క్యాస్ట్ సర్టిఫికేట్‌ను రద్దు చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది.
అక్రమమే!
నవనీత్ కౌర్ తప్పుడు పత్రం సమర్పించారంటూ శివసేన చేసిన ఫిర్యాదుపై విచారణ జరిపిన హైకోర్టు జూన్ 8న తీర్పు ఇచ్చింది. "షెడ్యూల్డ్ కుల ధ్రువీకరణ పత్రం పొందటానికి నవనీత్ కౌర్ 'మోచి' అనే సామాజిక వర్గానికి చెందిని వారిగా తన వాదన వినిపించారు. దీన్ని కోర్టు విశ్వసించడం లేదు. ఆ వాదన మోసపూరితమైంది. రిజర్వుడు నియోజకవర్గంలో అభ్యర్థిగా పోటీ చేసి అన్య ప్రయోజనాలను పొందాలనే ఉద్దేశంతో చేసినట్లు కమిటీ విచారణలో తేలింది. దీంతో ఆమె కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేస్తున్నాం. రెండు లక్షల రూపాయల జరిమానా విధిస్తున్నాం" అని నాడు స్పష్టం చేసింది.