జనవరి 4 నుంచి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో వాదనలు పునఃప్రారంభం కానున్నాయి. క్రిస్మస్, నూతన సంవత్సర సెలవుల తర్వాత కేసుల విచారణ మొదలు కానుంది. సాగు చట్టాలు, రైతు నిరసనలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లతో పాటు పలు కీలక వ్యాజ్యాలు విచారణకు రానున్నాయి.
సాగు చట్టాలకు వ్యతిరేకంగా పలువురు వ్యాజ్యం దాఖలు చేయగా.. రవాణా ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని దిల్లీ సరిహద్దు నుంచి రైతులను తొలగించేలా చూడాలని మరికొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే.. కేంద్రం, రైతులు చర్చలు జరపాలని... ఇరు పక్షాల వాదనలు వినేందుకు నిష్పాక్షిక, స్వతంత్ర కమిటీ ఏర్పాటుకు యోచిస్తున్నట్లు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు పేర్కొంది. అవసరమైతే సెలవుల్లోనూ సుప్రీంకు రావొచ్చని పిటిషనర్లకు సూచించింది. కానీ, మరోసారి ఈ వ్యాజ్యాలు విచారణకు రాలేదు.
ఇతర కేసులు
సైన్యంలో మహిళా అధికారులకు శాశ్వత కమిషన్కు సంబంధించిన కేసును డిసెంబర్ 30న సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈ వ్యాజ్యం జనవరి 19న విచారణకు రానుంది. జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం దీనిపై వాదనలు విననుంది.