తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Covid-19: 1,882 మంది అనాథలయ్యారు! - సుప్రీంకోర్టుకు బాలల హక్కుల సంఘం వివరణ

దేశంలో కరోనా(Covid-19) కారణంగా 1,882 మంది చిన్నారులు తల్లిదండ్రులిద్దర్నీ కోల్పోయి అనాథలైనట్లు జాతీయ బాలల హక్కుల సంఘం వెల్లడించింది. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకర్ని కోల్పోయిన చిన్నారుల సంఖ్య 7,464! సుప్రీంకోర్టుకు మంగళవారం సమర్పించిన అఫిడవిట్‌లో ఈ వివరాలు పేర్కొంది. ఏడాదికాలంలో కొవిడ్‌(Covid-19) కారణంగా 9,346 మంది పిల్లలు ఏదోరకంగా బాధితులుగా మిగిలినట్లు వెల్లడించింది.

children orphaned by COVID
సుప్రీంకోర్టుకు బాలల హక్కుల సంఘం నివేదిక

By

Published : Jun 2, 2021, 7:19 AM IST

కొవిడ్‌ మహమ్మారి(Covid-19) దెబ్బల్లో కనిపించని దయనీయ కోణం చిన్నారులు! దేశవ్యాప్తంగా కరోనా కాఠిన్యానికి వేలమంది చిన్నారులు బలయ్యారు! మరణించిన వారిగురించి కాదు చెబుతోంది! బతికుండీ.. అమ్మానాన్నలిద్దరూ మాయమైనవారు.. తామెవరివారమో తెలియని అయోమయంలో పడ్డవారూ.. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిని కోల్పోయినవారూ.. ఇలా అనాథలైన బాలలు ప్రస్తుతం వేలమంది! దేశంలో కరోనా కారణంగా ఈ 1,882 మంది చిన్నారులు తల్లిదండ్రులిద్దర్నీ కోల్పోయి అనాథలైనట్లు జాతీయ బాలల హక్కుల సంఘం వెల్లడించింది. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకర్ని కోల్పోయిన చిన్నారుల సంఖ్య 7,464! సుప్రీంకోర్టుకు మంగళవారం సమర్పించిన అఫిడవిట్‌లో సంఘం ఈ వివరాలు పేర్కొంది. ఏడాదికాలంలో కొవిడ్‌(Covid-19) కారణంగా 9,346 మంది పిల్లలు ఏదోరకంగా బాధితులుగా మిగిలినట్లు వెల్లడించింది. సుప్రీంకోర్టు గత నెల 28న జారీచేసిన ఉత్తర్వులకు అనుగుణంగా జాతీయ బాలల హక్కుల సంఘం రాష్ట్రాల నుంచి అధికారికంగా వివరాలు సేకరించింది. ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లల హక్కులను రక్షించి, తదనంతరం వారిని నిరంతరం ట్రాక్‌ చేయడానికి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాల్సి ఉన్నట్లు సంఘం సుప్రీంకిచ్చిన అఫిడవిట్లో పేర్కొంది. కరోనా కారణంగా అత్యధికంగా యూపీలో 2,110 మంది, బిహార్‌లో 1,327 మంది, కేరళలో 952 మంది, మహారాష్ట్రలో 796 మంది, హరియాణాలో 776 మంది, మధ్యప్రదేశ్‌లో 712 మంది పిల్లలు దెబ్బతిన్నట్లు సంఘం తెలిపింది. అంతేగాకుండా... కొవిడ్‌ సమయంలో ఇలాంటి పిల్లల సంక్షేమం కోసం తీసుకుంటున్న, తీసుకోవాల్సిన చర్యలనూ ప్రతిపాదించింది.

వారితో జాగ్రత్త!

  • ఈ పిల్లలకు ఆలనా పాలన, భద్రత అవసరం. జువెనైల్‌ జస్టిస్‌ యాక్ట్‌-2015 సెక్షన్‌ 27 ప్రకారం ప్రతి జిల్లా స్థాయిలో బాలల సంక్షేమ కమిటీలు ఏర్పాటయ్యాయి. ప్రస్తుతం కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులంతా తీవ్ర కుంగుబాటులో ఉంటారు కాబట్టి వారందర్నీ జిల్లా కమిటీల ముందు హాజరుపరచడం మంచిది.
  • ఇటీవల ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు ఇలాంటి చిన్నారుల వివరాలు రాబట్టడంలో నిమగ్నమైనట్టు ఫిర్యాదులు అందుతున్నాయి. ఆ సంస్థలు, వ్యక్తులు వీరికి సాయం చేస్తామన్న పేరుతో అనాథ చిన్నారులను ఎలాంటి నియమ నిబంధనలు పాటించకుండా దత్తత ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. దీనివల్ల చట్ట విరుద్ధమైన దత్తత కార్యక్రమాలు పెరిగే ప్రమాదముంది. కాబట్టి... ఈ చిన్నారుల ప్రయోజనాల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వాలు చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలి.
  • కొందరు ప్రభుత్వ అధికారులు తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల వివరాలను ప్రైవేటు ఎన్‌జీవోలు, ఇతర సంస్థలకు చట్ట విరుద్ధంగా అందిస్తున్నట్లు తెలిసింది. ఇలాంటి ఉదంతాలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నాం. మా దృష్టికి వచ్చిన ఫిర్యాదుల గురించి మే 26న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకూ లేఖ రాశాం.
  • ఆలనా పాలన, సంరక్షణ అవసరమైన చిన్నారులను ట్రాక్‌ చేయడానికి బాల్‌ స్వరాజ్‌ పేరుతో ఆన్‌లైన్‌ ట్రాకింగ్‌ వ్యవస్థ ఏర్పాటు చేశాం. ప్రస్తుతం కొవిడ్‌ నేపథ్యంలో ఈ పోర్టల్‌ను తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నారుల వివరాలు సేకరించడానికి వినియోగిస్తున్నాం.
  • ప్రస్తుతం ఇంట్లో సంపాదించే వ్యక్తిని కోల్పోవడం పిల్లల మానసికస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అది వారి ఎదుగుదలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. అందువల్ల ప్రభుత్వ అధికారులు, పిల్లలు చదువుతున్న పాఠశాలలు స్పందించి వారు అదే స్కూల్‌ వాతావరణంలో చదువుకునేలా చర్యలు తీసుకోవాలి.
  • ఈ అంశంపై పలు సిఫార్సులతో మే 27న రాష్ట్రాలకు లేఖ రాశాం. ఇద్దరు తల్లిదండ్రులనుకానీ, లేదంటే సంపాదించే వ్యక్తిని కానీ కోల్పోయిన పిల్లలు ప్రైవేటు స్కూల్‌లో చదువుతుంటే విద్యాహక్కు చట్టం కింద వారి ఫీజుల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలే భరించేలా చూడాలి.

పీఎంకేర్స్‌ బాలల నిధి వివరాలు తెలపండి:

కరోనా కారణంగా అనాథలైన చిన్నారుల సాంత్వన కోసం ప్రకటించిన పీఎంకేర్స్‌ బాలల నిధి పథకం వివరాలను తెలపాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. కన్నవారిని పోగొట్టుకొన్న చిన్నారులను గుర్తించడం, వారి సంక్షేమానికి తీసుకుంటున్న చర్యల సమాచారాన్ని న్యాయస్థాన సహాయకారి(అమికస్‌ క్యూరీ) గౌరవ్‌ అగర్వాల్‌తో పంచుకొనేందుకు వీలుగా కార్యదర్శి లేదా సంయుక్త కార్యదర్శి స్థాయి అధికారిని నోడల్‌ అధికారిగా నియమించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. కొవిడ్‌-19 వల్ల అనాథలైన చిన్నారుల కష్టాలపై సుప్రీంకోర్టు సుమో మోటోగా చేపట్టిన కేసులో అమికస్‌ క్యూరీ వివరాలు సమర్పించగా జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు, జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌లతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. కరోనా బాధిత బాలల కోసం మే 29న కేంద్రం పథకాన్ని ప్రకటించినప్పటికీ పూర్తి వివరాలు అందుబాటులోకి రాలేదని అమికస్‌ క్యూరీ తెలిపారు. పూర్తి సమాచారాన్ని అందజేసేలా చూడాలని అదనపుసొలిసిటర్‌ జనరల్‌ ఐశ్వర్యా భాతికి ధర్మాసనం సూచించింది. తదుపరి విచారణ కొనసాగే సోమవారం అనాథ బాలల సంఖ్య అధికంగా ఉన్న పది రాష్ట్రాలలోని చిన్నారుల కేసులను పరిశీలిస్తామని ధర్మాసనం తెలిపింది.

ఇదీ చదవండి:'అనాథలైన పిల్లల కోసం కేంద్రం ఏం చేస్తోంది?'

ABOUT THE AUTHOR

...view details