నీట్ వైద్యవిద్య ప్రవేశాల్లో రిజర్వేషన్ల(Neet Reservation News) అంశంపై వివరణ ఇవ్వాలని కేంద్రం, మెడికల్ కౌన్సెలింగ్ కమిటీని సుప్రీంకోర్టు ఆదేశించింది. అఖిల భారత కోటాలోకి వచ్చే సీట్లలో వెనుకబడిన తరగతులకు(ఓబీసీలు) 27శాతం రిజర్వేషన్లు, ఆర్థికంగా వెనకబడిన తరగతులు(ఈడబ్ల్యూఎస్) వారికి 10శాతం రిజర్వేషన్లు(Neet Reservation News) కల్పిస్తూ.. జులై 29న కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
నీట్ పోస్టు గ్రాడ్యుయేట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సహా మొత్తం 8మంది పిటిషన్‌దారులు దాఖలు చేసిన ఈ వాజ్యంపై జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ బీవీ నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇదే అంశంపై పెండింగ్‌లో ఉన్న ఇతర పిటిషన్లను కూడా ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. ఈ తాజా వ్యాజ్యంపై న్యాయవాది వివేక్ సింగ్ వాదనలు వినిపించారు. జులై 29న జారీ చేసిన నోటీసుల ప్రకారం.. అఖిల భారత కోటాలోకి వచ్చే సీట్లలో ఓబీసీలకు 27శాతం, ఈడబ్ల్యూఎస్‌కు 10శాతం రిజర్వేషన్లను వర్తింపజేయనున్నట్లు కేంద్రం ప్రకటించిందని తెలిపారు. అయితే.. ఇది రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించడమే అని ఆరోపించారు. ఆ నోటీసులను తక్షణమే రద్దు చేయాలని కోరారు.