EWS Supreme Court : ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(ఈడబ్ల్యూఎస్)కు విద్యాసంస్థలు, ఉద్యోగాల్లో 10 శాతం కోటా(రిజర్వేషన్లు) కల్పిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసుకు సంబంధించిన తీర్పును రిజర్వ్ చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు.లలిత్, న్యాయమూర్తులు జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ త్రివేది, జస్టిస్ పార్దీవాలాతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసును విచారించింది. రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ అనేక మంది సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపించారు.
ఈ కేసుకు సంబంధించి ప్రధాన వ్యాజ్యాన్ని 'జనహిత్ అభియాన్' అనే సంస్థ 2019లో దాఖలు చేసింది. 103వ సవరణ.. రాజ్యాంగ మౌలిక స్వభావాన్ని మార్చేస్తోందని పేర్కొంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వీటితో పాటు సుమారు 40 వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు.లలిత్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం.. ఆరున్నర రోజల పాటు సుదీర్ఘంగా విచారణ జరిపింది. కేంద్రం ప్రత్యేక నిబంధనలు రూపొందించడానికి అనుమతించే 103వ రాజ్యాంగ సవరణ.. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని అతిక్రమిస్తోందా అన్న విషయాన్నీ పరిశీలించింది. వాదనలు విన్న తర్వాత తీర్పు రిజర్వు చేసింది.