దళిత క్రైస్తవులు, దళిత ముస్లింలను షెడ్యూలు కులాల(ఎస్సీ) జాబితా నుంచి మినహాయించడాన్ని కేంద్ర ప్రభుత్వం సమర్థించుకుంది. షెడ్యూలు కులాలకు వర్తిస్తున్న ప్రయోజనాలు దళిత క్రైస్తవులు, దళిత ముస్లింలు పొందలేరని పేర్కొంటూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. చారిత్రక ఆధారాల ప్రకారం దళిత క్రైస్తవులు, దళిత ముస్లింలలో వెనకబాటు లేదని, అణచివేతకూ గురికాలేదని స్పష్టం చేసింది. ఇస్లాం, క్రైస్తవ మతం స్వీకరించిన దళితులకు రిజర్వేషన్లు, ఇతర ప్రయోజనాలు వర్తింపజేయాలని ఓ ఎన్జీఓ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యానికి స్పందనగా ఈ అఫిడవిట్ సమర్పించింది.
'మతం మారిన దళితులకు ఎస్సీ హోదా'... కేంద్రం ఏం చెప్పిందంటే? - ఎస్సీ రిజర్వేషన్ దళితులు
ఇస్లాం, క్రైస్తవ మతం స్వీకరించిన దళితులను ఎస్సీ జాబితా నుంచి మినహాయించడంపై కేంద్రం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. షెడ్యూల్ కులాలను గుర్తించడమనేది సామాజిక అసమానతలపైనే ఆధారపడి ఉంటుందని స్పష్టం చేసింది.
1950 రాజ్యాంగ ఉత్తర్వులు (ఎస్సీ) రాజ్యాంగానికి విరుద్ధంగా లేవని సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ.. సుప్రీంకోర్టుకు వివరించింది. షెడ్యూల్ కులాలను గుర్తించడమనేది సామాజిక అసమానతలపైనే ఆధారపడి ఉంటుందని, 1950 రాజ్యాంగ ఈ ఆర్డర్లోని వర్గాలకే ఆ ప్రయోజనాలు వర్తిస్తాయని స్పష్టం చేసింది.
'అంటరానితనం అనే అణచివేత వ్యవస్థ వల్ల హిందూ సమాజంలోని కులాల్లో వెనుకబాటుతనం ఏర్పడుతుంది. క్రైస్తవ, ఇస్లాం సమాజాల్లో ఇలాంటి వ్యవస్థ లేదు. చారిత్రక డేటా ప్రకారం చూసినా.. క్రైస్తవ, ఇస్లాం వర్గాలకు చెందిన కులాల్లో వెనుకబాటుతనం, అణచివేత లేవు. అణచివేత వ్యవస్థ నుంచి బయటకు వచ్చేందుకే షెడ్యూల్ కులాలకు చెందిన ప్రజలు మతం మారుతున్నారు. క్రైస్తవ, ఇస్లాం మతాల్లో అణచివేత లేకపోవడమే ఇందుకు ఓ కారణం' అని కేంద్రం తన నివేదికలో పేర్కొంది. దళిత క్రైస్తవులు, ముస్లింలకు షెడ్యూల్ కులాల జాబితాలో చోటు కల్పించాలని జస్టిస్ రంగనాథ్ మిశ్ర కమిషన్ నివేదికను సైతం కేంద్రం తోసిపుచ్చింది. ఈ నివేదికలో దీర్ఘదృష్టి లోపించిందని అభిప్రాయపడింది.