పార్లమెంటు ఉభయ సభలను కుదిపేస్తున్న పెగసస్ స్పైవేర్ వివాదంలో మరికొన్ని కొత్త విషయాలను 'ది వైర్' న్యూస్ పోర్టల్ బుధవారం వెల్లడించింది. మనదేశానికి చెందిన దాదాపు 300 మందిని లక్ష్యంగా ఎంచుకొని నిఘా పెట్టాల్సిన జాబితాలో వారి ఫోన్ నంబర్లను చేర్చారని 17 మీడియా సంస్థలతో కూడిన గ్లోబల్ కన్సార్షియం పేర్కొన్న విషయం తెలిసిందే. వీరిలో ప్రతిపక్షాలకు చెందిన రాజకీయ ప్రముఖులు, హక్కుల సంఘాల నేతలు, పాత్రికేయులు, న్యాయవాదులు ఉన్నారంటూ ఓ జాబితాను 'ది వైర్' ఇప్పటికే ప్రచురించింది. బుధవారం వెల్లడించిన తాజా వివరాల్లో సుప్రీంకోర్టు రిజిస్ట్రార్లుగా పని చేసిన ఇద్దరి ఫోన్లూ హ్యాకింగ్ జాబితాలో కనిపించాయని పేర్కొంది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి పాత ఫోన్ నంబరు, మాజీ అటార్నీ జనరల్ సహాయకుడి ఫోన్ నంబరు కూడా నిఘా పెట్టాల్సిన జాబితాలో ఉన్నట్లు తెలిపింది.
వారిపై నిఘా ఎందుకు?
సుప్రీంకోర్టు రిజిస్ట్రార్లు ఎన్.కె.గాంధీ, టి.ఐ.రాజ్‌పుత్‌ల ఫోన్ నంబర్లను 2019లోనే నిఘా పెట్టాల్సిన జాబితాలో చేర్చినట్లు 'ది వైర్' తెలిపింది.(ప్రస్తుతం గాంధీ పదవీ విరమణ చేశారు.) 'సర్వోన్నత న్యాయస్థానంలో కీలకమైనది రిట్ పిటిషన్ల విభాగం. ఏడాదికి వెయ్యికి పైగా రిట్ పిటిషన్లు వస్తుంటాయి. వాటిలో కేంద్ర ప్రభుత్వానికి ఇబ్బందికరమైనవీ, రాజకీయంగా సున్నితమైనవీ ఉంటాయి కనుక అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి రిజిస్ట్రార్లపై నిఘా పెట్టి ఉంటారు' అని వైర్ పేర్కొంది. "జస్టిస్ అరుణ్ మిశ్ర సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా గత ఏడాది పదవీ విరమణ పొందారు. ప్రస్తుతం జాతీయ మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్‌గా ఉన్నారు. జస్టిస్ మిశ్ర ఫోన్ నంబరు 2019లో హ్యాకింగ్ జాబితాలో చేరింది. 2014 నుంచే ఆ ఫోన్‌ను వినియోగించడంలేదని ఆయన తెలిపారు. అయినప్పటికీ 2018 వరకూ జస్టిస్ మిశ్ర పేరు మీదనే ఆ ఫోన్ కొనసాగింది' అని వైర్ పోర్టల్ వెల్లడించింది.
అధికార పక్షానికి సన్నిహితుడైనా..