కర్ణాటకకు ఆక్సిజన్ కోటాను పెంచాలంటూ ఆ రాష్ట్ర హైకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.
కర్ణాటకకు ప్రస్తుతమున్న 965 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కోటాను 1200 మెట్రిక్ టన్నులకు పెంచాలని రాష్ట్ర హైకోర్టు మే 5న ఆదేశాలు జారీ చేసింది. దీన్ని వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించగా.. తాజాగా చుక్కెదురైంది. అన్ని హైకోర్టులు ఇదే విధంగా కేటాయింపు పెంచాలని ఆదేశిస్తే.. సరఫరా వ్యవస్థ అస్తవ్యస్తమవుతుందని కేంద్రం వాదించింది.
అయితే కేంద్రం వ్యాఖ్యలను సుప్రీం తోసిపుచ్చింది. న్యాయాధికారాలను ఉపయోగించి సహేతుకంగానే కర్ణాటక హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసిందని అభిప్రాయపడింది.