తమిళనాడులో కరోనా కేసులకు సంబంధించిన వ్యాజ్యం విచారణలో ఎన్నికల సంఘంపై హత్య కేసు పెట్టాలంటూ మద్రాస్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు.. ఉద్దేశపూర్వకమైనవి కావని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆ వ్యాఖ్యలు తీవ్రంగా ఉన్నప్పటికీ అవి ఆదేశాల్లో భాగం కాదని జస్టిస్ డీవై చంద్రాచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువరించింది. కేవలం మౌఖికంగా అన్న వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నం కాబోదని స్పష్టం చేసింది.
మద్రాస్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకునేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఈసీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. సాధారణ విచారణ సమయంలో కోర్టు చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని పేర్కొంది. కరోనా వేళ.. హైకోర్టులు అద్భుతంగా పనిచేస్తున్నాయని ప్రశంసించింది. హైకోర్టు.. మహమ్మారి కట్టడి విషయంలో కీలకపాత్ర పోషిస్తుందని తెలిపింది. అనంతరం ఈసీ పిటిషన్‌ను కొట్టివేసింది.