నీట్(Neet Exam) అభ్యర్థులు తమ పరీక్షా కేంద్రాలను మార్చుకునేలా తాము కేంద్రానికి ఆదేశాలివ్వలేమని సుప్రీంకోర్టు(Supreme Court On Neet) తేల్చి చెప్పింది. ఈ మేరకు దాఖలైన వ్యాజ్యాన్ని కొట్టివేసింది. జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ ఎస్ రవీంద్ర భట్, జస్టిస్ బేలా ఎం త్రివేదీలతో కూడిన ధర్మాసనం నీట్ పీజీ అభ్యర్థులు దాఖలు చేసిన ఈ వ్యాజ్యంపై విచారణ చేపట్టి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
2021 జూన్ నీట్ పరీక్షకు అర్హులైన అభ్యర్థులు.. తమ పరీక్షా కేంద్రాన్ని మార్చుకునే అవకాశం ఉందని పిటిషనర్లు వ్యాజ్యంలో పేర్కొన్నారు. కానీ, 2021 మార్చి పరీక్షకు అర్హులైన అభ్యర్థులకు మాత్రం ఆ అవకాశం లేదని చెప్పారు. దాంతో వారు చాలా దూరం ప్రయాణించాల్సి వస్తోందని కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం.. ప్రస్తుతం దేశంలో అన్ని పనిచేస్తూనే ఉన్నాయని గుర్తుచేసింది. అభ్యర్థులు ఎక్కడికంటే అక్కడికి సులభంగా వెళ్లగలరని చెప్పింది.
"ఇప్పుడు ఎలాంటి ఆంక్షలు లేవు. మీరు ఏ విమానాశ్రయానికి వెళ్లినా విమానంలో సీటు దొరుకుతుంది. ప్రజలు దిల్లీ నుంచి చెన్నైకి వెళ్లగలుగుతున్నారు. దిల్లీ నుంచి కొచ్చికీ వెళ్లగలుగుతున్నారు."