వైద్య విద్య చివరి సంవత్సరం పరీక్షల రద్దు లేదా వాయిదాకు సుప్రీంకోర్టు నిరాకరించింది. పీజీ వైద్య విద్యార్థులు.. కొవిడ్ విధుల్లో నిమగ్నమయ్యారనే నెపంతో పరీక్షల రద్దు లేదా వాయిదాపై విశ్వవిద్యాలయాలకు ఆదేశాలు జారీ చేయలేమని స్పష్టం చేసింది.
29 మంది వైద్యులు కలిసి వేసిన వ్యాజ్యంపై జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు స్పందించింది. కొవిడ్ ఉద్ధృతిని దృష్టిలో ఉంచుకుని పరీక్షలను తేదీలను ప్రకటించాలని ఇప్పటికే జాతీయ వైద్య మండలికి తాము సూచించిన విషయాన్ని గుర్తుచేసింది న్యాయస్థానం. ఆ మేరకే విశ్వవిద్యాలయాలు పరీక్షల తేదీలను నిర్ణయించాలని పేర్కొంది. అయితే పరీక్షలకు సన్నద్ధమవడానికి విద్యార్థులకు తగిన సమయం ఇవ్వకుండా తేదీలను నిర్ణయించడం సరికాదని ధర్మాసం వ్యాఖ్యానించింది. అలాగే ఆ సమయాన్ని న్యాయస్థానం నిర్ణయించలేదని పేర్కొంది.