తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఇస్రో గూఢచర్యం కేసులో సుప్రీం కీలక తీర్పు.. నలుగురు పోలీసుల బెయిల్​ రద్దు - ఇస్రో గూఢచర్యం కేసు

ISRO Espionage Case : ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్‌ను గూఢచర్యం కేసులో ఇరికించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు పోలీసు అధికారులకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. వారికి కేరళ హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. బెయిల్‌ రద్దైన వారిలో గుజరాత్‌ మాజీ డీజీపీ ఆర్‌.బి.శ్రీకుమార్‌ కూడా ఉన్నారు.

ISRO espionage case
ISRO espionage case

By

Published : Dec 2, 2022, 1:12 PM IST

ISRO Espionage Case : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) గూఢచర్యం కేసులో భారత సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. గూఢచర్యం వ్యవహారంలో శాస్త్రవేత్త నంబి నారాయణ్‌ను ఇరికించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న.. మాజీ డీజీపీ సహా నలుగురు నిందితులకు మంజూరైన బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు కేరళ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్‌ను జస్టిస్‌ ఎం.ఆర్‌. షా, జస్టిస్‌ సి.టి. రవికుమార్‌ ధర్మాసనం తోసిపుచ్చింది.

ఈ కేసులో సీబీఐ చేసిన అపీళ్లను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు ధర్మాసనం పేర్కొంది. దీనికి సంబంధించిన అన్ని పిటిషన్లను తిరిగి కేరళ హైకోర్టుకే పంపిస్తున్నట్లు చెప్పింది. నిందితుల బెయిల్‌ దరఖాస్తులను మళ్లీ మొదటి నుంచి విచారించాలన్న సుప్రీంకోర్టు.. నాలుగు వారాల్లోగా దీనిపై తీర్పు వెలువరించాలని కేరళ హైకోర్టును ఆదేశించింది. అయితే ముందస్తు బెయిల్‌ దరఖాస్తులపై కోర్టు తీర్పు వెలువరించేదాకా నిందితులను అరెస్టు చేయకుండా వారికి రక్షణ కల్పించింది.

1994లో క్రయోజనిక్‌ ఇంజిన్‌ తయారీకి సంబంధించిన కీలక పత్రాలను.. శాస్త్రవేత్త నంబి నారాయణ్‌ విదేశీయులకు అప్పగించారంటూ కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే క్రయోజనిక్‌ ఇంజిన్‌ పనులు ఆలస్యం కావాలన్న విదేశీ కుట్రలో భాగంగానే కేరళ పోలీసులు నంబి నారాయణ్‌పై గూఢచర్యం ఆరోపణలు చేశారంటూ సీబీఐ కేసు నమోదు చేసింది. అప్పటి పోలీసు అధికారులైన గుజరాత్‌ మాజీ డీజీపీ ఆర్‌.బి.శ్రీకుమార్‌, విశ్రాంత నిఘా అధికారి పి.ఎస్‌.జయ్‌ప్రకాశ్‌, ఇద్దరు పోలీసు అధికారులు ఎస్‌.విజయన్‌, థంపి ఎస్‌ దుర్గా దత్‌పై కేసులు పెట్టింది. అయితే వారికి కేరళ హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయడం వల్ల దానిని సవాలు చేస్తూ సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

నంబి నారాయణ్‌పై కేసు పెట్టడం ద్వారా క్రయోజనిక్‌ ప్రాజెక్టు పనులు ఆగిపోయాయని, రోదసీ కార్యక్రమాలు ఒకటి, రెండు దశాబ్దాల పాటు వెనకబడ్డాయని సీబీఐ వాదించింది. నిందితులకు బెయిల్‌ ఇస్తే విచారణకు ఆటంకం కలుగుతుందని పేర్కొంది. దీనిపై విచారణ జరిపిన జస్టిస్‌ ఎం.ఆర్‌. షా, జస్టిస్‌ సి.టి. రవికుమార్‌ ధర్మాసనం.. వారి బెయిల్‌ను రద్దు చేసింది.

ఇవీ చదవండి:కోర్టులో టిప్పులు.. యూనిఫాంపై క్యూఆర్‌ కోడ్‌తో బిళ్ల బంట్రోతు వసూళ్లు

మూసేవాలా హత్య కేసు సూత్రధారి అరెస్ట్.. కాలిఫోర్నియాలో చిక్కిన గోల్డీ బ్రార్​!

ABOUT THE AUTHOR

...view details