తెలంగాణ

telangana

By

Published : Feb 16, 2022, 8:02 AM IST

ETV Bharat / bharat

ముగ్గురు దివంగత న్యాయమూర్తులకు సీజేఐ ​నివాళి

SC pays homage: దివంగత జస్టిస్‌ కస్లివాల్‌, జస్టిస్‌ పి.బి.సావంత్‌, జస్టిస్‌ సురిందర్‌ సింగ్‌ నిజ్జర్‌లు న్యాయవ్యవస్థకు అందించిన విశేష సేవలకు గుర్తింపుగా జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులంతా మంగళవారం సమావేశమై నివాళులర్పించారు. ఆ ముగ్గురు న్యాయమూర్తులు న్యాయవ్యవస్థకు అందించిన సేవలను శ్లాఘించారు.

cji ramana
ఎన్​వీ రమణ

SC pays homage: ముగ్గురు దివంగత న్యాయమూర్తులకు సుప్రీంకోర్టు మంగళవారం నివాళులు అర్పించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన సంతాప కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ మాట్లాడుతూ దివంగత న్యాయమూర్తులు జస్టిస్‌ ఎన్‌.ఎం.కస్లివాల్‌, జస్టిస్‌ పి.బి.సావంత్‌, జస్టిస్‌ సురిందర్‌ సింగ్‌ నిజ్జర్‌లు న్యాయవ్యవస్థకు అందించిన సేవలను శ్లాఘించారు.

ఇందులో రాజస్థాన్‌కు చెందిన జస్టిస్‌ కస్లివాల్‌ 1989 అక్టోబరు నుంచి 1993 ఏప్రిల్‌ వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవలు అందించారు. 2021 జనవరి 10న కన్నుమూశారు. 1989 అక్టోబర్‌ నుంచి 1995 జూన్‌ వరకు సర్వోన్నత న్యాయస్థాన న్యాయమూర్తిగా పనిచేసిన మహారాష్ట్రకు చెందిన పీబీ సావంత్‌ 2021 ఫిబ్రవరి 15న స్వర్గస్థులయ్యారు. చిన్నప్పటి నుంచే ఇంగ్లండ్‌లో చదువుకున్న ఎస్‌ఎస్‌ నిజ్జర్‌ 2009 నవంబరు నుంచి 2014 జూన్‌ వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవలందించి 2021 మార్చి 26న తిరిగిరాని లోకాలకు వెళ్లారు.

ఈ ముగ్గురు న్యాయమూర్తులు న్యాయవ్యవస్థకు అందించిన విశేష సేవలకు గుర్తింపుగా జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులంతా మంగళవారం సమావేశమై నివాళులర్పించారు. ఈ సందర్భంగా జస్టిస్‌ ఎన్‌.వి.రమణ మాట్లాడుతూ ఈ ముగ్గురూ న్యాయమూర్తులుగా విశేష సేవలు అందించడంతోపాటు, దేశ న్యాయవ్యవస్థ పరిణామక్రమంలో కీలకమైన పాత్ర పోషించినట్లు శ్లాఘించారు. అబ్దుల్‌ రెహమాన్‌ అంతులే వర్సెస్‌ ఆర్‌ఎస్‌ నాయక్‌ కేసులో తీర్పు ఇచ్చిన ధర్మాసనంలో భాగస్వామిగా ఉన్న జస్టిస్‌ ఎన్‌ఎం కస్లివాల్‌ నిందితుల హక్కులకూ రక్షణ కల్పించారని గుర్తుచేశారు. అధికరణం-21 కింద పొందుపరిచిన జీవించే హక్కులో విచారణ వేగంగా జరగడం కూడా అంతర్భాగమని చెప్పారని, ఆ హక్కు దర్యాప్తు అన్ని దశల్లోనూ వర్తిస్తుందని చెప్పారని పేర్కొన్నారు.

జస్టిస్‌ పి.బి.సావంత్‌ మండల్‌ కమిషన్‌, ఎస్‌ఆర్‌ బొమ్మై వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పుల్లో భాగస్వామిగా ఉన్నట్లు పేర్కొన్నారు. జస్టిస్‌ ఎస్‌.ఎస్‌.నిజ్జర్‌ కూడా రిలయెన్స్‌ ఇండస్ట్రీస్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా, స్విస్‌ టైమింగ్‌ లిమిటెడ్‌ వర్సెస్‌ ఆర్గనైజింగ్‌ కమిటీ, కామన్‌వెల్త్‌ గేమ్స్‌ 2010 కేసుల్లో కోర్టు ఇచ్చిన కీలకమైన తీర్పుల్లో భాగస్వామిగా ఉన్నట్లు గుర్తుచేశారు.

భౌతికంగా వారు దూరం కావడం పెద్దలోటు అని, దాన్ని భరించే శక్తిని వారి కుటుంబసభ్యులకు ఇవ్వాలని జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో అటార్నీ జనరల్‌ కె.కె.వేణుగోపాల్‌, సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా, సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వికాస్‌ సింగ్‌, అడ్వొకేట్స్‌ ఆన్‌ రికార్డ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు శివాజీ ఎం.జాదవ్‌తోపాటు, దివంగత న్యాయమూర్తుల కుటుంబసభ్యులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:

ఏబీజీ షిప్‌యార్డు ఛైర్మన్‌పై సీబీఐ లుక్‌ అవుట్‌ నోటీసులు

ABOUT THE AUTHOR

...view details