చెల్లని చెక్కుల కేసులను త్వరగా పరిష్కరించే విషయమై సుప్రీంకోర్టు శుక్రవారం పలు మార్గదర్శకాలు ఇచ్చింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే, జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ ఎ.ఎస్.బోపన్న, జస్టిస్ ఎస్.రవీంద్ర భట్‌లతో కూడిన అయిదుగురు సభ్యుల ధర్మాసనం 27 పేజీల ఆదేశాలను జారీ చేసింది. ధర్మాసనం తరఫున జస్టిస్ బోబ్డే వీటిని రాశారు. దేశంలో ప్రస్తుతం 35.16 లక్షల చెల్లని చెక్కుల కేసులు పెండింగ్‌లో ఉండడం వల్ల ఈ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు తనకు తానుగా స్వీకరించి విచారణ జరిపింది.
- చెక్ బౌన్స్‌కు సంబంధించి ఒక వ్యక్తిపై 12 నెలల కాలంలో నమోదైన కేసులు అన్నింటినీ కలిపి ఒకేసారి విచారణ జరపాలి.
- సాక్షులను కోర్టులో ప్రత్యక్షంగా విచారించాల్సిన అవసరం లేదు. ప్రమాణ పత్రాలనే సాక్ష్యంగా పరిగణిస్తే సరిపోతుంది.
- తాను నేరం చేయలేదని నిందితుడు వాదించకపోతే ఉన్న ఆధారాలను పరిగణనలోకి తీసుకొని మేజిస్ట్రేట్ తక్షణమే తీర్పు ప్రకటించవచ్చు. కోర్టు పరిధిలో లేని వ్యక్తిపై ఫిర్యాదు వచ్చినప్పుడు దర్యాప్తునకు ఆదేశించాలి.
- ఒక వ్యక్తికి సమన్లు ఇచ్చే విషయమై ముందు తీసుకున్న నిర్ణయాన్ని పునఃసమీక్షించే అధికారం ట్రయల్ కోర్టులకు లేదు.
- ఈ కేసుల విచారణకు సంబంధించి హైకోర్టులన్నీ మేజిస్ట్రేట్లకు 'పాటించాల్సిన నిబంధనలు' (ప్రాక్టీస్ డైరెక్షన్స్) పంపించాలి. ఈ మేరకు నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ చట్టంలో కేంద్రం తగిన సవరణలు చేయాలి.