కరోనా ఉద్ధృతి దృష్ట్యా.. దేశంలోని జైళ్లలో ఖైదీల సంఖ్యను తగ్గించేలా చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనా నేపథ్యంలో గతేడాది పెరోల్, బెయిల్ పొందిన ఖైదీలకు మరో 90 రోజుల పాటు పెరోల్ మంజూరు చేయాలని సూచించింది.
గతేడాది మార్చిలో కరోనా ఉద్ధృతి దృష్ట్యా.. జైళ్లలో ఖైదీల సంఖ్యను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. న్యాయస్థానం ఆదేశాలపై తక్షణం స్పందించిన రాష్ట్ర ప్రభుత్వాలు హైపవర్డ్ కమిటీలు(హెచ్పీసీ) ఏర్పాటు చేసి.. వాటి మార్గదర్శకాల ఆధారంగా ఖైదీలను విడుదల చేశాయి. ప్రస్తుతం కరోనా ఉద్ధృతి దృష్ట్యా.. మరోసారి హెచ్పీసీలు పునఃపరీలించకుండా త్వరగా ఖైదీలను విడుదల చేయాలని న్యాయస్థానం ఆదేశించింది.