తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రేప్ కేసుల్లో 'టూ ఫింగర్ టెస్టు'లపై సుప్రీం సీరియస్.. ఆధార్-ఓటర్ ఐడీ లింక్​పై నోటీసులు - రెండు వేళ్ల పరీక్ష

అత్యాచార బాధితులకు నిర్వహించే 'టూ ఫింగర్ టెస్ట్'లు ఇప్పటికీ కొనసాగుతుండటం దురదృష్టకరమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ పరీక్షలను అడ్డుకునేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. మరోవైపు, ఆధార్- ఓటర్ ఐడీ అనుసంధానాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్​ను విచారణకు స్వీకరించిన సుప్రీం.. ఖైదీలకు ఓటేసే అవకాశం లేకపోవడంపై నమోదైన పిల్​కు కేంద్రం, 'ఈసీ'ల నుంచి స్పందన కోరింది.

sc-on-two-finger-test
sc-on-two-finger-test

By

Published : Oct 31, 2022, 2:30 PM IST

అత్యాచారం జరిగిందో లేదోనని నిర్ధరించేందుకు మహిళలకు చేసే 'రెండు వేళ్ల పరీక్ష'లు ఇప్పటికీ కొనసాగుతుండటాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. సమాజంలో ఇప్పటికీ ఇవి కొనసాగుతుండటం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. ఈ మేరకు.. హత్యాచారం కేసులో భాగంగా ఓ నిందితుడిని దోషిగా తేల్చుతూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం ధర్మాసనం సమర్థించింది. ట్రయల్ కోర్టు తీర్పును తప్పుబట్టిన ఝార్ఖండ్ హైకోర్టు నిర్ణయాన్ని తోసిపుచ్చింది. ఈ మేరకు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం తీర్పుచెప్పింది.

"రెండు వేళ్ల పరీక్ష అనేది మహిళల గోప్యత, గౌరవమర్యాదలకు భంగం కలిగిస్తుంది. ఇప్పటికీ ఈ పరీక్షలు కొనసాగుతుండటం దురదృష్టకరం. ఇలాంటి పరీక్షలు ఎవరు చేసినా.. దుష్ప్రవర్తన నేరం కింద పరిగణించాలి" అని సుప్రీంకోర్టు పేర్కొంది. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని ధర్మాసనం ఆదేశించింది. ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కళాశాలల పాఠ్యాంశాల నుంచి 'రెండు వేళ్ల పరీక్ష'కు సంబంధించిన అంశాలను తొలగించాలని స్పష్టం చేసింది.

ఏంటీ పరీక్ష!
దేశంలోని పలు ప్రాంతాల్లో రెండు చేతి వేళ్లను ఉపయోగించి మహిళలకు కన్యత్వ పరీక్ష జరుపుతున్నారు. 'టూ ఫింగర్ టెస్ట్‌'గా పిలిచే ఈ పరీక్షను సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గతంలో అత్యాచార బాధితులను పరీక్షించడానికి వినియోగించేవారు. కానీ ఆ తర్వాత దీన్ని అశాస్త్రీయమైనదిగా భావించిన అత్యున్నత న్యాయస్థానం ఈ పరీక్షను రద్దు చేసింది. అయినా వధువుకు కన్యత్వ పరీక్ష చేయడానికి దేశంలోని కొన్ని తెగల్లో ఇప్పటికీ ఈ అశాస్త్రీయమైన మూఢనమ్మకాన్ని పాటించడం గమనార్హం!

ఇదీ చదవండి:స్త్రీల పాలిట శాపంగా కన్యత్వ పరీక్షలు.. ఇంకెన్నాళ్లీ అరాచకం?

నోటీసులు
ఆధార్​తో ఓటర్ కార్డు అనుసంధానాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను విచారించేందుకు సుప్రీంకోర్టు సోమవారం అంగీకరించింది. ఓటుహక్కు అనేది అత్యంత పవిత్రమైనదని.. ఆధార్ లేనంత మాత్రాన ఆ హక్కును తిరస్కరించకూడదని పిటిషనర్ వాదించారు. ప్రజలకు ప్రయోజనం కలిగించే సేవల కోసం ఆధార్ తప్పనిసరి చేయొచ్చు గానీ.. హక్కులను తిరస్కరించడానికి కాదని సుప్రీంకోర్టు 2019లో ఇచ్చిన తీర్పును పిటిషనర్ ప్రస్తావించారు. అన్ని హక్కుల్లోకెల్లా అత్యున్నతమైన ఓటుహక్కుకు దీన్ని తప్పనిసరి చేయడం తగదని అన్నారు.వీటిని పరిగణనలోకి తీసుకున్న సుప్రీం.. ఇదే అంశంపై మాజీ మేజర్ జనరల్ ఎస్​జీ వొంబట్కెరె దాఖలు చేసిన పిటిషన్​తో జతచేసింది.

'వారికి ఓటు హక్కు ఉండొద్దా?'
ఖైదీలకు ఓటేసే అవకాశాన్ని దూరం చేస్తున్న ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధనలను సవాల్ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై కేంద్రం, ఎన్నికల సంఘం స్పందన కోరింది సుప్రీం. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 62(5) రాజ్యాంగబద్ధతను ప్రశ్నిస్తూ జాతీయ న్యాయ విశ్వవిద్యాలయానికి చెందిన ఓ విద్యార్థి 2019లో ఈ పిల్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీం.. కేంద్రం, ఈసీకి నోటీసులు పంపింది. దీనిపై తదుపరి విచారణ డిసెంబర్ 29కి వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details