ఆరేళ్ల క్రితం రద్దైన ఐటీ చట్టం కింద ఇంకా కేసులు నమోదు చేయడంపై సుప్రీంకోర్టు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, హైకోర్టు రిజిస్ట్రార్ జనరళ్లకు నోటీసులు జారీచేసింది.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 66Aను 2015లోనే సుప్రీంకోర్టు రద్దుచేసినప్పటికీ ఇంకా కేసులు నమోదు చేస్తున్నారని ఒక స్వచ్చంద సంస్థ పిటిషన్ వేసింది. విచారణ చేపట్టిన జస్టిస్ ఆర్ఎఫ్ నారీమన్, జస్టిస్ బిఆర్ గవాయ్‌తో కూడిన ధర్మాసనం.. పోలీసు శాఖ రాష్ట్ర పరిధిలోని అంశం కాబట్టి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను పిటిషన్‌లో ప్రతివాదులుగా చేయడం ఉత్తమమని పేర్కొంది. పోలీసులే కాకుండా న్యాయవ్యవస్థ కూడా ఈ అంశంలో ప్రమేయం ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఈ నేపథ్యంలో అన్నిరాష్ట్రాల హైకోర్టులకు నోటీసులు జారీ చేస్తున్నట్లు.. సుప్రీం కోర్టు తెలిపింది.