SC modifies sentence of rape: 10ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి అనంతరం ఆమెను హత్య చేసిన కేసులో దోషికి హైకోర్టు విధించిన శిక్షను సవరించింది సుప్రీంకోర్టు. దోషి సహజమరణం పొందే వరకు జైలులోనే ఉండాలని హైకోర్టు తీర్పు ఇవ్వగా.. దాన్ని కాస్త సవరించి అతనికి 30 ఏళ్ల కారాగార శిక్ష ఖరారు చేసింది సర్వోన్నత న్యాయస్థానం. శిక్షాకాలం మాత్రం తగ్గించవద్దని స్పష్టం చేసింది. జస్టిస్ ఎల్ నాగేశ్వర్ రావు, జస్టిస్ హృషికేశ్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు బుధవారం తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా ఐపీసీ సెక్షన్ 376-ఏను ప్రస్తావించింది.
"అప్పీలుదారు నేరారోపణకు సంబంధించి దిగువ కోర్టుల తీర్పుకు భంగం కలిగించకుండా, సహజ జీవితకాల యావజ్జీవ కారాగార శిక్షను 30 సంవత్సరాలకు సవరించాలని మేము భావిస్తున్నాము. సెక్షన్ 376-ఏ ప్రకారం ఇలాంటి నేరాల్లో దోషికి 20 సంవత్సరాలకు తగ్గకుండా జైలు శిక్ష విధించాలి. ఆ తర్వాత శిక్షా కాలాన్ని పొడిగించవచ్చు." అని ధర్మాసనం పేర్కొంది.