తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కేసులుంటే ఎన్నికల్లో పోటీకి నో​'.. కేంద్రానికి 4 వారాల గడువు - criminalisation of politics PIL supreme court

తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న నేతలు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆదేశాలివ్వాలని దాఖలైన పిటిషన్​పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈ వ్యాజ్యంపై కేంద్ర ప్రభుత్వం నాలుగు వారాల్లోగా స్పందన తెలియజేయాలని ఆదేశించింది.

Supreme court PIL barring charged serious crimes
Supreme court PIL barring charged serious crimes

By

Published : Apr 10, 2023, 6:28 PM IST

Updated : Apr 10, 2023, 7:20 PM IST

తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న నేతలను ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యం​పై సుప్రీం కోర్టు విచారణ జరిపింది. నాలుగు వారాల్లోగా కేంద్ర ప్రభుత్వం కౌంటర్​ దాఖలు చేయాలని అత్యున్నత న్యాయస్థానం సోమవారం ఆదేశించింది. విచారణ చేపట్టిన జస్టిస్​ కేఎమ్ జోసెఫ్​, జస్టిస్​ బీవీ నాగరత్న ధర్మాసనం.. ముందుగా తీవ్రమైన నేరాలుగా వేటిని పరిగణించాలో కేంద్రం గుర్తించాలని పేర్కొంది. ఈ విషయంలో ఇంతవరకు కేంద్రం తన స్పందన తెలియజేయలేదని గుర్తు చేసింది. ప్రభుత్వం తన వైఖరిని తెలియజేసేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అదనపు సొలిసిటర్​ జనరల్​ సంజయ్​ జైన్​కు సూచించింది. ఈ వ్యాజ్యంపై జులైలో తదుపరి విచారణ ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న వారిని ఎన్నికల్లో పాల్గొనకుండా ఆదేశాలు జారీ చేయాలని.. అలాంటి అభ్యర్థులను నిరోధించడానికి కేంద్రం, ఎన్నికల సంఘం చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని అశ్వినీ ఉపాధ్యాయ్​ అనే న్యాయవాది పిటిషన్​పై దాఖలు చేశారు. లా కమిషన్​ చేసిన సిఫార్సులు, కోర్టు ఆదేశాలను.. కేంద్రం, ఎన్నికల సంఘం అమలు చేయలేదని పిటిషన్​లో తెలిపారు. 2019 లోక్​సభ ఎన్నికల్లో గెలిచిన 539 మందిలో.. 233(43 శాతం) మంది తమపై క్రిమినల్​ కేసులు ఉన్నాయని ఎన్నికల అఫిడవిట్​లో పేర్కొన్నారని పిటిషన్​లో ప్రస్తావించారు.

"కొన్ని సంవత్సరాలుగా నేర చరిత్ర కలిగిన అభ్యర్థుల శాతం, వారి గెలుపు అవకాశాలు గణనీయంగా పెరిగాయి. గతంలో రాజకీయ నాయకుల మన్ననలు పొందాలనుకున్న నేరస్థులు.. ఇప్పుడు రాజకీయాల్లోకి రావడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఎన్నికలు ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని భావిస్తున్న రాజకీయ పార్టీలు.. 'సెల్ఫ్​ ఫైనాన్స్​' చేసుకునే నేరస్థులవైపే మొగ్గుచూపుతున్నాయి. క్రమంగా పార్టీలు వారి పైనే ఆధారపడుతున్నాయి. ఎన్నికల్లో కేసులు లేని అభ్యర్థుల కంటే.. నేరస్థులు గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది." అని న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్ వ్యాజ్యంలో పేర్కొన్నారు.

క్రిమినల్స్​ను తమ పార్టీల్లోకి ఆహ్వానించడానికి.. రాజకీయ పార్టీలు పోటీపడుతున్నాయని పిటిషనర్ ఆరోపించారు. రాజకీయాలను నేరపూరితం చేయడం వల్ల ప్రజలకు చాలా నష్టం జరుగుతోందని చెప్పారు. అయినా.. ఇప్పటికీ రాజకీయ పార్టీలు నేరగాళ్లను అభ్యర్థులుగా ప్రకటిస్తున్నాయని అన్నారు. దీని కారణంగా ప్రజలు తమ ప్రాథమిక హక్కు అయిన ఓటును.. స్వేచ్ఛగా వేయలేకపోతున్నారని పిటిషన్​లో తెలిపారు.

అసోషియేషన్ ఫర్​ డెమొక్రటిక్ రిఫార్మ్స్​- ఏడీఆర్​ గణాంకాలను పిటిషనర్​ తన వ్యాజ్యంలో ప్రస్తావించారు. 2009 నుంచి ఇప్పటి వరకు తీవ్రమైన నేరారోపణలు ఉన్న ఎంపీల సంఖ్య 109 శాతం పెరిగిందని ఏడీఆర్​ లెక్కగట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ఒక ఎంపీ.. తనపై 204 కేసులున్నాయని ఎన్నికల అఫిడవిట్​లో వివరాలు వెల్లడించారని అశ్వినీ ఉపాధ్యాయ్​ తన పిటిషన్​లో పేర్కొన్నారు.

Last Updated : Apr 10, 2023, 7:20 PM IST

ABOUT THE AUTHOR

...view details