సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మోహన్ ఎం.శాంతనగౌడర్ కన్నుమూశారు. ఆయన వయసు 62సంవత్సరాలు. ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో దిల్లీ శివారులోని గురుగ్రామ్ మేదాంత ఆస్పత్రిలో చేరిన జస్టిస్ శాంతనగౌడర్ ఐసీయూలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. శనివారం రాత్రి వరకు న్యాయమూర్తి ఆరోగ్యం నిలకడగానే ఉందన్న వైద్యులు అర్ధరాత్రి 12.30 గంటల ప్రాంతంలో ఆయన కన్నుమూసినట్లు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారని సుప్రీంకోర్టు అధికారులు తెలిపారు. జస్టిస్ శాంతనగౌడర్‌కు కరోనా సోకిందా లేదా అన్నది వెల్లడించలేదు.
2017 ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన జస్టిస్ శాంతనగౌడర్ 1958 మే 8న కర్ణాటకలో జన్మించారు. 2003 మే 12న కర్ణాటక హైకోర్టు అదనపు జడ్జిగా నియమితులైన ఆయన 2004లో పూర్తిస్థాయి న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.