తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పార్టీల 'ఉచిత' హామీలపై కేంద్రం, ఈసీకి సుప్రీం నోటీసులు - election procedure

SC Notices to Centre: ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల వేళ.. కేంద్రం, ఎన్నికల సంఘానికి సుప్రీం కోర్టు నోటీసులు పంపింది. 'ఉచిత' హామీలతో ఓటర్లను మభ్యపెట్టే రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్​పై స్పందించాలని సూచించింది.

SC notice to Centre, poll panel
SC notice to Centre, poll panel

By

Published : Jan 25, 2022, 12:11 PM IST

Updated : Jan 25, 2022, 4:20 PM IST

SC Notices to Centre on election freebies: ఉచిత వాగ్దానాలతో ఓట్లు వేయించుకోవడం తీవ్రమైన సమస్య అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఎన్నికల ముందు ప్రజాధనం వినియోగించి ఉచిత వాగ్దానాలు చేసే రాజకీయ పార్టీల ఎన్నికల గుర్తును వెనక్కి తీసుకుని, అలాంటి వాగ్దానాలు చేస్తున్న రాజకీయ పార్టీల గుర్తింపును రద్దు చేసేలా ఎన్నికల కమిషన్‌కు దిశానిర్దేశం చేయాలన్న పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది సర్వోన్నత న్యాయస్థానం. కేంద్ర ప్రభుత్వానికి, భారత ఎన్నికల కమిషన్‌కు నోటీసులు జారీ చేసింది. ఇది చాలా తీవ్రమైన సమస్య అని.. దేశంలో ఉచిత బడ్జెట్‌ సాధారణ బడ్జెట్‌ను మించి పోయిందని, ఇది అసమానమైన విధానాన్ని సృష్టిస్తుందని విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వి రమణ వ్యాఖ్యానించారు.

పిటిషన్​లో ఏముంది?

ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ వేర్వేరు రాజకీయ పార్టీలు ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తూ ఈ పిటిషన్ వేశారు భాజపా నేత అశ్వనీ కుమార్ ఉపాధ్యాయ. ఆమ్‌ఆద్మీపార్టీ 18ఏళ్ల వయసు ఉన్న ప్రతి మహిళకు నెలకు వెయ్యి రూపాయలు ఇస్తామంటే.. ప్రతి మహిళకు రెండు వేలు ఇవ్వనున్నట్లు శిరోమణి అకాలీదళ్‌ వాగ్దానం చేసిందని పేర్కొన్నారు. ప్రతి ఇంటిలో గృహిణికి నెలకు రెండు వేల రూపాయలు, సంవత్సరానికి 8 గ్యాస్‌ సిలిండర్లు ఇస్తామని కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. కాలేజ్‌కు వెళ్లే ప్రతి అమ్మాయికి స్కూటీ, 12వ తరగతి ఉత్తీర్ణులైన వారికి రూ.20వేలు, 10వ తరగతి ఉత్తీర్ణులైన తర్వాత రూ.15వేలు ఇవ్వనున్నట్లు ప్రకటించిందని పిటిషన్​లో పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌ కోసం ప్రత్యేకంగా.. 12వ తరగతి చదివే అమ్మాయిలకు ఉచితంగా స్మార్ట్‌ఫోన్‌లు అందజేస్తామని హామీలు గుప్పించారని వివరించారు. ఈ విధంగా.. డబ్బు పంపిణీ, ఉచిత వాగ్దానాలు ప్రమాదక స్థాయికి చేరుకున్నాయని పిటిషనర్‌ వాదించారు.

ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఉచిత, అహేతుక వాగ్దానాలు ఇవ్వడం.. రాజ్యాంగ ఉల్లంఘన అని.. లంచం, మితిమీరిన ప్రభావానికి లోను చేయడమే అని ప్రకటించాలని అశ్వనీ ఉపాధ్యాయ కోరారు. ఐపీసీ 171బి, 171సి నిబంధనలను పరిగణనలోకి తీసుకుని... సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

ఒక్కో వ్యక్తిపై సుమారు రూ. మూడు లక్షలు రుణ భారం ఉన్న రాష్ట్రాలు ఉన్నాయని.. అయినప్పటికీ.. ఇంకా ఉచితాలను అందిస్తున్నాయని పిటిషనర్‌ తరపు సీనియర్‌ న్యాయవాది వికాస్‌ సింగ్‌ పేర్కొన్నారు. ఎన్నికల సంఘం నిబంధనలు ఉన్నా... వాటికి కోరలు లేని పరిస్థితి నెలకొని ఉందని, ఒకసారి పంజాబ్‌ వైపు చూస్తే తెలుస్తుందని వికాస్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు. దీనికి సిజేఐ స్పందిస్తూ.. ఒక్క పంజాబ్‌ను మాత్రమే ఎందుకు ప్రస్తావిస్తారని తప్పుబట్టారు.

పిటిషన్‌లో కొన్ని రాజకీయ పార్టీల పేర్లు మాత్రమే ప్రస్తావించడాన్ని ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం తప్పుబట్టింది. కొన్ని రాష్ట్రాలు, పార్టీలను మాత్రమే ఎత్తిచూపడం పట్ల అనుమానం వ్యక్తం చేసింది. ఒకటి రెండు రాజకీయ పార్టీలను మాత్రమే ఎంపిక చేసుకున్నారని... పిటిషనర్‌ సెలక్టివ్‌గా ఉన్నారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయితే.. పిటషనర్‌ లేవనెత్తాలనుకున్న విషయం తీవ్రమైనది కాబట్టి.. కేంద్రానికి, ఎన్నికల సంఘానికి నోటీసు జారీ చేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. విచారణను నాలుగు వారాలు వాయిదా వేసింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇవీ చూడండి:ఇద్దరు మాజీ సీఎంల 'పరువు నష్టం' గొడవ- చివరకు విజయం ఆయనదే

పంచాయతీ ఆఫీస్​లో మోదీ ఫొటో కోసం గొడవ- ఒకరు అరెస్ట్

Last Updated : Jan 25, 2022, 4:20 PM IST

ABOUT THE AUTHOR

...view details