కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్ డేటా సహా వ్యాక్సినేషన్ అనంతర సమాచారాన్ని బహిరంగపరచాలని దాఖలైన పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అంతర్జాతీయ వైద్య ప్రమాణాల ప్రకారం టీకా ట్రయల్స్ డేటాను ప్రభుత్వం తప్పక పబ్లిష్ చేయాల్సి ఉంటుందని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ విన్నపాన్ని పరిశీలించిన దేశ అత్యున్నత ధర్మాసనం.. స్పందన కోరుతూ కేంద్రంతో పాటు, టీకా తయారీ సంస్థలైన భారత్ బయోటెక్, సీరం ఇన్స్టిట్యూట్కు నోటీసులు జారీ చేసింది.
దేశంలో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో టీకాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని సుప్రీం పేర్కొంది. ఈ పిటిషన్‌పై విచారణకు ఆదేశిస్తే.. ప్రజల్లో అనుమానాలు రేకెత్తించినట్లు కాదా అని ప్రశ్నించింది. ప్రతి ఒక్కరు టీకా తీసుకునే వరకు ఎవరూ సురక్షితం కాదన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) వ్యాఖ్యలను జస్టిస్ ఎల్ నాగేశ్వర రావు, జస్టిస్ అనిరుద్ధ బోస్‌తో కూడిన బెంచ్ ప్రస్తావించింది.
"మన దేశంలో టీకా అపోహ అనే సమస్యపై పోరాడుతున్నాం. కరోనా పోరులో ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యల్లో ఇదొకటని డబ్ల్యూహెచ్ఓ చెబుతోంది. మేం ఈ పిటిషన్‌పై దర్యాప్తునకు ఆదేశిస్తే.. ప్రజల ఆలోచనల్లో అనుమానాలు రేకెత్తించినట్లు కాదా?"