తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Lakhimpur Kheri: 'మిగతా కేసుల్లోనూ నిందితులతో ఇలాగే వ్యవహరిస్తారా?' - సీజేఐ

లఖింపుర్​ ఖేరి ఘటనపై(Lakhimpur Kheri news) ఉత్తర్​ప్రదేశ్​ సర్కారు నుంచి మాటలే తప్ప చర్యలు లేవని పేర్కొంది సుప్రీం కోర్టు(Supreme court news). ఇప్పటి వరకు తీసుకున్న చర్యలపై అసహనం వ్యక్తం చేసింది. సిట్​ బృందంలో అందరూ స్థానిక అధికారులేనా? అని ప్రశ్నించింది. అన్నింటికీ సీబీఐ విచారణే పరిష్కారం కాదని స్పష్టం చేసింది.

Supreme court
సుప్రీం కోర్టు

By

Published : Oct 9, 2021, 7:11 AM IST

లఖింపుర్‌ ఖేరిలో(Lakhimpur Kheri news) గత ఆదివారం జరిగిన హింసాత్మక ఘటనల్లో 8 మంది మరణానికి కారణమైన నిందితుల పట్ల ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును సుప్రీంకోర్టు(Supreme court news) తీవ్రంగా ఆక్షేపించింది. ప్రభుత్వ వ్యవహారశైలి ఏమాత్రం సంతృప్తికరంగా లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ పేర్కొన్నారు. 'దయచేసి విచారణకు హాజరుకండి' అంటూ నిందితుడికి సీఆర్‌పీసీ-160 కింద పోలీసులు నోటీసులు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. మిగతా కేసుల్లోని నిందితుల విషయంలోనూ ఇలాగే వ్యవహరిస్తారా? అని నిలదీశారు. ఘటనలపై దర్యాప్తునకు పూర్తిగా స్థానిక అధికారులతోనే సిట్‌ వేయడాన్ని ఆయన తప్పుబట్టారు. వారిని కొనసాగించే ప్రశ్నే లేదన్నారు. ఈ కేసులోని వ్యక్తులను దృష్టిలో పెట్టుకుని దర్యాప్తును సీబీఐకి అప్పగించాలనుకోవడం లేదని, అన్నిటికీ సీబీఐ ఒక్కటే పరిష్కారం కాదని, మరే ఏజెన్సీతో విచారణ జరిపిస్తే బాగుంటుందో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్‌ న్యాయవాది హరీశ్‌సాల్వేకి సూచించారు. లఖింపుర్‌ ఖేరి ఉదంతంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని అభ్యర్థిస్తూ ఇద్దరు న్యాయవాదులు లేఖ రాయడంతో- ఈ అంశంపై జస్టిస్‌ ఎన్‌.వి.రమణ(CJI of India), జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ హిమా కోహ్లీల ధర్మాసనం విచారణ చేపడుతున్న సంగతి తెలిసిందే.

ఈ కేసులో శుక్రవారం హరీశ్‌సాల్వే వాదనలు వినిపించారు. "నిందితుడిపై (కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్‌మిశ్ర కుమారుడు ఆశిష్‌) ఆరోపణలొచ్చాయి. కేసు తీవ్రత దృష్ట్యా ఆయనకు 160 కింద నోటీసులిచ్చి, విచారణకు పిలిచాం. సమయం కోరడంతో శనివారం ఉదయం 11 గంటలకల్లా రమ్మన్నాం" అని కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై జస్టిస్‌ ఎన్‌.వి.రమణ(CJI NV Ramana) అసంతృప్తి వ్యక్తం చేశారు. "ఇక్కడ చాలా గంభీరమైన అభియోగాలున్నాయి. ఎఫ్‌ఐఆర్‌లో 302, ఇతర సెక్షన్లు నమోదయ్యాయి. ఇలాంటి కేసులన్నింటి విషయంలోనూ ఇలాగే వ్యవహరిస్తారా? మీకు నోటీసులు పంపుతున్నాం, దయచేసి హాజరుకండి అని మిగతా నిందితులనీ ఇలాగే అర్థిస్తారా?" అని ప్రశ్నించారు. సాల్వే బదులిస్తూ, "పోస్ట్‌మార్టంలో మృతునికి బుల్లెట్‌ గాయాలు కనిపించలేదు. అందుకే నిందితునికి 160 కింద నోటీసులిచ్చారు. బుల్లెట్‌ గాయముంటే పరిస్థితులు మరోలా ఉండేవి. కారును నడిపిన విధానంచూస్తే ఆరోపణలు నిజమేనని అనిపిస్తుంది. అందుకే ఇది 302 కేసు కిందికే వస్తుంది" అన్నారు. ఇందుకు సీజేఐ మాట్లాడుతూ- "నిందితుడి ప్రమేయం గురించి ప్రత్యక్షంగా చూసినవారు చెబుతున్నారు కదా? మేము బాధ్యతాయుత ప్రభుత్వాన్ని, పోలీసు అధికారులను, వ్యవస్థను ఆశిస్తున్నాం. 302 కింద కేసు నమోదైనప్పుడు, మృతుడి శరీరంపై తుపాకీతో కాల్చిన గాయాలున్నప్పుడు ఈ దేశంలోని మిగతా నిందితులతోనూ ఇలాగే వ్యవహరిస్తారా? నోటీసులిచ్చి దయచేసి రండి అని అడుగుతారా? పోస్ట్‌మార్టం నివేదికలో బుల్లెట్‌ గాయాలు లేవని నిందితుడితో ఇలా వ్యవహరించవచ్చా? అత్యంత తీవ్రమైన కేసులో మీరు వ్యవహరించాల్సిన తీరులో వ్యవహరించలేదు" అన్నారు.

విచారణను 18వ తేదీకి వాయిదా వేయాలని, ఆలోగా కేసు విషయంలో అవసరమైన చర్యలన్నీ తీసుకుంటామని అత్యున్నతస్థాయి వర్గాలు చెప్పినట్టు సాల్వే కోర్టుకు విన్నవించారు. ఈ వ్యాఖ్యలతో సీజేఐ ఏకీభవించలేదు. "రాష్ట్ర ప్రభుత్వం మాటల్లో తప్ప చేతల్లో చర్యలు కనిపించడంలేదు. సాధారణంగా 302 కింద కేసు నమోదుచేశాక పోలీసులు ఏం చేస్తారు? తక్షణం నిందితుడిని అదుపులోకి తీసుకుంటారు. ఇక్కడ మీరు నోటీసులిచ్చి, హాజరుకావాలని అడుగుతున్నారు" అని హరీశ్‌సాల్వేని ఉద్దేశించి సీజేఐ అన్నారు. జస్టిస్‌ సూర్యకాంత్‌ జోక్యం చేసుకుని, "ఇది 8 మంది దారుణహత్యకు సంబంధించిన కేసు. ఇందులో నిందితులు ఒకరు, ఇద్దరు, ముగ్గురు ఉండొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో చట్టం తనపని తాను చేసుకుపోయి, నిందితులందరిపై చర్యలు తీసుకొని ఉండాల్సింది" అని అన్నారు. అనంతరం ప్రధాన న్యాయమూర్తి విచారణను ఈనెల 20కి వాయిదా వేశారు.

సిట్‌లో వారు వద్దే వద్దు..

జస్టిస్‌ రమణ మాట్లాడుతూ- "ఘటనపై వేసిన సిట్‌ జాబితా చూశాం. అందులో డీఐజీ, ఎస్పీలు, సర్కిల్‌ ఆఫీసర్లు, ఇన్‌స్పెక్టర్లను నియమించారు. వీరంతా స్థానికులు కాబట్టే ఇలా జరుగుతోంది. కేసును సీబీఐకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసిందా?" అని ప్రశ్నించారు. ఇప్పటివరకూ అలా కోరలేదని సాల్వే చెప్పారు. కేసు విచారణను దసరా సెలవుల వరకూ వాయిదా వేయాలని, కావాలంటే అప్పుడు సీబీఐకి అప్పగించాలని.. ఆలోగా ప్రస్తుత కార్యాచరణను కొనసాగనివ్వాలని.. లేకుంటే దర్యాప్తు జాప్యమవుతుందని కోర్టుకు విన్నవించారు. ఇందుకు సీజేఐ స్పందిస్తూ- "కేసు గంభీరతను బట్టి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాం. అన్నింటికీ సీబీఐ విచారణే పరిష్కారం కాదు. అందుకు కారణమేంటన్నది మీకే బాగా తెలుసు. కేసుతో సంబంధమున్న వ్యక్తులను దృష్టిలో ఉంచుకొని, మేం కూడా సీబీఐ విచారణ పట్ల ఆసక్తి చూపడం లేదు. సిట్‌ అధికారులను కొనసాగించే ప్రశ్నే లేదు. రెండుమూడు రోజుల నుంచి వారి ప్రవర్తన చూస్తున్నాం. దర్యాప్తు సజావుగా జరుగుతుందన్న నమ్మకం లేదు. మరేదైనా ఏజెన్సీ దర్యాప్తు చేపట్టేలోగా.. సాక్ష్యాధారాలను పూర్తిగా ధ్వంసంచేసే పరిస్థితి రాకూడదు. అన్ని సాక్ష్యాధారాలను కచ్చితంగా సంరక్షించాలని డీజీపీకి చెప్పండి" అని ఆదేశించారు. అందుకు సాల్వే అంగీకరించారు. హోంశాఖ కార్యదర్శి, డీజీపీలకు తానే ఈ విషయం చెప్పి, న్యాయస్థానం ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని కోరతానన్నారు.

వారికి కొంతైనా స్పృహ ఉండాలి

భారత ప్రధాన న్యాయమూర్తి లఖ్‌నవూ వెళ్లి, లఖింపుర్‌ ఖేరి బాధిత కుటుంబాలను కలిశారంటూ టౌమ్స్‌నౌ ఛానల్‌ ట్విట్టర్‌లో పేర్కొనడం పట్ల సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ప్రచారం చేసినవారికి కొంతైనా స్పృహ(సెన్స్‌) ఉండాలన్నారు. తాను కోర్టులో కూర్చొని ఉంటే, లఖ్‌నవూ వెళ్లి బాధితులను ఎలా కలుస్తానన్నది వారికే తెలియాలన్నారు. విచారణ సందర్భంగా ఆదిత్య అనే యువ న్యాయవాది ఈ ట్వీట్‌ విషయమై ప్రస్తావించారు. ఇందుకు సీజేఐ స్పందిస్తూ- "ఇలాంటి వాటి గురించి నేనేమీ మాట్లాడదలచుకోలేదు. ఇవన్నీ టీవీలు చేసే ప్రచారం. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మిస్టర్‌ ఆదిత్యా! ప్రజా జీవితంలో ఉన్నప్పుడు మనం పూలు, రాళ్లు రెండూ స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి" అని నవ్వుతూ అన్నారు. ప్రైవేటు జీవితాలను కూడా వదిలి పెట్టడంలేదన్న వ్యాఖ్యతో ఆయన ఏకీభవించారు. జస్టిస్‌ సూర్యకాంత్‌ మాత్రం ట్వీట్‌పై తీవ్ర అభ్యంతరం తెలిపారు. "ఇది చాలా దురదృష్టకరం. కొందరు భావప్రకటన స్వేచ్ఛ హద్దులను దాటడం బాధాకరం. ట్వీట్‌లోని అంశాలు పూర్తిగా అవాస్తవం. ఈ విషయంలో ప్రధాన న్యాయమూర్తి గౌరవప్రదంగా వ్యవహరించారు. కానీ, ఇది పూర్తిగా కోర్టు ధిక్కారం కిందికే వస్తుంది. ట్వీట్‌కు బాధ్యులైనవారు తప్పు ఎందుకు జరిగిందో చెబుతూ దాన్ని సరిదిద్దుకుంటారని ఆశిస్తున్నాం. లేకుంటే ఏంచేయాలన్నది తగిన సమయంలో నిర్ణయిస్తాం" అని పేర్కొన్నారు. మీడియా స్వతంత్రతను తాము గౌరవిస్తామని, అలాగని హద్దులు మీరడం న్యాయం కాదని జస్టిస్‌ హిమా కోహ్లీ వ్యాఖ్యానించారు.

ABOUT THE AUTHOR

...view details