భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్‌ను ప్రమాణ స్వీకారం చేయకుండా నిరోధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. పిటిషన్‌ను స్వీకరించడానికి తమకు ఎటువంటి కారణం కనిపించలేదని సుప్రీంకోర్టు తెలిపింది. దురుద్దేశంతో పిటిషన్ దాఖలు చేసినట్లు అభిప్రాయపడింది. పిటిషన్‌పై త్వరితగతిన విచారణ చేపట్టాలని సీజేఐ యూయూ లలిత్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం ముందు ప్రత్యేకంగా ప్రస్తావించారు పిటిషనర్ ముర్సలిన్ అసిజిత్. గురువారం విచారణ చేపట్టాలని సీజేఐ ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు పిటిషనర్.
సీజేఐగా జస్టిస్ చంద్రచూడ్ నియామకంపై అభ్యంతరం.. పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు - dy chandrachud tenure as cji
తదుపరి సీజేఐగా జస్టిస్ డీవై చంద్రచూడ్‌ను నియమించకూడదంటూ దాఖలైన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయ స్థానం కొట్టిపారేసింది. పిటిషన్‌ను స్వీకరించడానికి తమకు ఎటువంటి కారణం కనిపించలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలోనే స్పందించిన సీజేఐ ధర్మాసనం.. బుధవారం మధ్యాహ్నమే ప్రత్యేకంగా విచారణ చేపట్టింది. జస్టిస్ చంద్రచూడ్‌పై పలు ఆరోపణలు చేస్తూ.. రషీద్ పఠాన్ అనే వ్యక్తి రాష్ట్రపతికి చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈ వ్యాజ్యం దాఖలు చేశారు పిటిషనర్. అందులో లేవనెత్తిన అంశాలకు సంబంధించి ఆధారాలు చూపాలని కోరారు సీజేఐ. అందుకు పిటిషనర్ సరైన ఆధారాలు చూపకపోవడం వల్ల పిటిషన్‌ను కొట్టివేశారు. వ్యాజ్యం అంతా తప్పుడు అంశాలతో ఉందని, దురుద్దేశపూర్వకంగా దాఖలు చేశారని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ 74 రోజుల స్వల్ప కాలం పాటు పదవీ బాధ్యతలు నిర్వహించనున్నారు. నవంబర్ 8న జస్టిస్ లలిత్ పదవీ విరమణ చేయనుండగా నవంబర్ 9న జస్టిస్ చంద్రచూడ్ నూతన సీజేఐగా బాధ్యతలు స్వీకరిస్తారు. రెండేళ్ల పాటు సీజేఐగా కొనసాగనున్న జస్టిస్ చంద్రచూడ్ 2024 నవంబర్ 10న పదవీ విరమణ చేయనున్నారు. 44 ఏళ్ల క్రితం ఈయన తండ్రి జస్టిస్ యశ్వంత్ విష్ణు చంద్రచూడ్ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టి 7 ఏళ్ల 5 నెలలపాటు ఆ పదవిలో కొనసాగారు. సుదీర్ఘకాలం కొనసాగిన సీజేఐగా రికార్డు సృష్టించారు.