తెలంగాణ

telangana

By

Published : Aug 31, 2021, 12:38 PM IST

Updated : Aug 31, 2021, 5:27 PM IST

ETV Bharat / bharat

ఆ 40 అంతస్తుల టవర్లు కూల్చేయండి: సుప్రీం

ప్రముఖ నిర్మాణ సంస్ధ సూపర్‌టెక్‌కు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నోయిడాలో ఆ సంస్ధకు చెందిన 40 అంతస్తుల జంట భవనాలను కూల్చివేయాలని ఆదేశించింది. భవనాల నిర్మాణంలో నిబంధనలు ఉల్లంఘించారని తెలిపింది. ఫ్లాట్ల కొనుగోలుదారులకు 12శాతం వడ్డీతో తిరిగి డబ్బు చెల్లించాలని ఆదేశించింది. భవనాల కూల్చివేత ఖర్చును సూపర్‌టెక్‌ సంస్ధ నుంచే వసూలు చేయాలని నోయిడా అథారిటీకి సూచించింది.

SUPERTECH
ఆ 40 అంతస్తుల భవనాలు రెండింటినీ కూల్చేయండి: సుప్రీం ఆదేశం

ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాలో అక్రమ భవన నిర్మాణాలపై సుప్రీంకోర్టు కొరడా ఝుళిపించింది. నిర్మాణ సంస్థ సూపర్‌టెక్‌.. ఎమరాల్డ్‌ కోర్టు ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన 40 అంతస్తుల జంట భవనాలను కూల్చివేయాలని జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ ఎం.ఆర్​.షా నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది.

ఈ భవనాలను కూల్చివేయాలని 2014 ఏప్రిల్‌ 11న అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ సూపర్‌టెక్‌ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. జస్టిస్‌ చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తెలిపింది. హైకోర్టు తీర్పు సరైనదే అని వ్యాఖ్యానించింది. జంట భవనాల్లోని 915 గృహాలు, దుకాణాలను నోయిడా అథారిటీ నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా నిర్మించారని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ భవనాల్లో ఫ్లాట్లు, దుకాణాలను కొనుగోలు చేసిన వారికి బుకింగ్‌ చేసుకున్న తేదీ నుంచి 12 శాతం వడ్డీతో తిరిగి డబ్బులు చెల్లించాలని ఆదేశించింది. ఈ జంట భవనాల నిర్మాణం జరిపి అక్కడి గృహ సంక్షేమ సంఘాన్ని వేధింపులకు గురి చేసినందుకుగాను 2కోట్ల రూపాయలను సూపర్‌టెక్‌ పరిహారంగా చెల్లించాలని సూచించింది. భవనాల కూల్చివేత ఖర్చును మొత్తం సూపర్‌టెక్‌ సంస్థ నుంచే వసూలు చేయాలని నోయిడా అథారిటీకి సుప్రీం ధర్మాసనం సూచించింది. మూడు నెలల్లో ఆ భవనాల కూల్చివేతను పూర్తి చేయాలని తెలిపింది. నోయిడా అథారిటీ, నిపుణుల కమిటీ.. కూల్చివేతను పర్యవేక్షించాలని స్పష్టం చేసింది.

ఈ సందర్భంగా అక్రమ నిర్మాణాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మెట్రోపాలిటన్‌ నగరాల్లో అక్రమ నిర్మాణాలు పెరుగుతున్నాయని వీటిపై కఠినంగా వ్యవహరించాలని సూచించింది.

సూపర్​టెక్ స్పందన..

ఈ తీర్పుపై సూపర్​టెక్ స్పందించింది. సుప్రీం ఆదేశాలను సమీక్షించేందుకు రివ్యూ పిటిషన్​ను దాఖలు చేస్తామని సంస్థ ఎండీ మోహిత్ అరోడా తెలిపారు.

ఇదీ చూడండి: పెళ్లి కావట్లేదని కక్ష- యువతిని 17 సార్లు పొడిచి హత్య

Last Updated : Aug 31, 2021, 5:27 PM IST

ABOUT THE AUTHOR

...view details