భారత సైన్యంలో మరో 39 మంది మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ హోదా(Permanent Commission For Women) దక్కనుంది. ఈ హోదా కోసం వీరు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. అక్కడ అధికారిణులకు విజయం లభించింది. వారం పని దినాల్లోగా శాశ్వత కమిషన్ హోదా(Permanent Commission For Women) కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేయాలని కేంద్రాన్ని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.
సైన్యంలో 14ఏళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ హోదా ఇవ్వాలని సుప్రీంకోర్టు 2020 ఫిబ్రవరి 17న తీర్పు వెలువరించింది. ఫలితంగా సైన్యం ఓ కమిటీని ఏర్పాటు చేసి 400 మందికి పైగా మహిళా అధికారులకు ఈ హోదా(Permanent Commission For Women) కల్పించింది. మహిళా అధికారుల వార్షిక రహస్య నివేదిక సమీక్ష ఆధారంగా.. కొందరికే ఈ హోదా నిరాకరించింది. శాశ్వత కమిషన్ తిరస్కరణకు గురైన 71 మంది అధికారిణులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. శాశ్వత కమిషన్‌లో చేర్చే విధానం ఏకపక్షం, అన్యాయంగా ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు.