జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (ఎన్‌సీడీఆర్‌సీ)లో ఖాళీలను కేంద్ర ప్రభుత్వం భర్తీ చేయకపోవడంపై సుప్రీం కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇచ్చిన మాటను సర్కారు నిలబెట్టుకోలేదంటూ పెదవి విరిచింది. "ఆకాంక్షలను నెరవేర్చలేనప్పుడు ఆశలు రేపకూడదు" అని చురకలంటించింది. ఎన్‌సీడీఆర్‌సీలో ఖాళీగా ఉన్న మూడు స్థానాలను 8 వారాల్లోగా భర్తీ చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. వినియోగదారుల పరిరక్షణ చట్టం-2019 ప్రభావాన్ని తెలుసుకునేందుకుగాను 4 వారాల్లోగా ప్రత్యేక అధ్యయనాన్ని నిర్వహించాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. వినియోగదారుల సంబంధిత కమిషన్లలో నియామకాలు చేపట్టకపోవడం, వాటికి తగిన మౌలిక వసతులు కల్పించకపోవడంపై సుమోటోగా స్వీకరించిన కేసులో జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ హృశికేష్ రాయ్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ నిర్వహించింది.
'ఆకాంక్షలు నెరవేర్చనప్పుడు ఆశలు రేపకండి' - ఎన్‌సీడీఆర్‌సీ ఖాళీలు
కేంద్రానికి సుప్రీం కోర్టు చురకలంటించింది. ఎన్‌సీడీఆర్‌సీ ఖాళీలను భర్తీ చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఎన్‌సీడీఆర్‌సీలో నాలుగు స్థానాలను భర్తీ చేసిన కేంద్రం మరో మూడు నియామకాలను ఎందుకు చేపట్టలేకపోయిందని ధర్మాసనం ప్రశ్నించింది. ఖాళీల భర్తీని వేగంగా పూర్తిచేసేలా సంబంధిత అధికారులను ఒప్పిస్తామని అదనపు సొలిసిటర్ జనరల్ అమన్ లేఖి బదులిచ్చారు. దీంతో ధర్మాసనం స్పందిస్తూ "ఎన్‌సీడీఆర్‌సీలో ఖాళీలన్నింటినీ భర్తీ చేస్తామని మీరు గతంలో కూడా చెప్పారు. కానీ చేయలేదు. ఆకాంక్షలను నెరవేర్చలేనప్పుడు ఆశలు రేపకండి. కమిషన్లలో ఖాళీలు ఉండటంతో వినియోగదారుల ఫిర్యాదులు పేరుకుపోతున్నాయి" అని వ్యాఖ్యానించింది. వినియోగదారుల కమిషన్లలో ఖాళీలపై పలు రాష్ట్రాలు నివేదిక సమర్పించకపోవడంపై కూడా సర్వోన్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. వాటిలో ఖాళీలన్నింటినీ 8 వారాల్లోగా భర్తీ చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది.
ఇదీ చదవండి:మరో 3 ప్రాంతాల్లో సుప్రీం కోర్టు బెంచ్‌లు- నిజమేనా?