SC Covid ex gratia: కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం కోసం వచ్చిన నకిలీ దరఖాస్తులపై దర్యాప్తు జరిపేందుకు కేంద్రానికి సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. మహారాష్ట్ర, గుజరాత్, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నమోదైన మరణాల సంఖ్య.. పరిహారం కోసం వచ్చిన దరఖాస్తుల సంఖ్యకు పొంతనలేని కారణంగా ఆయా రాష్ట్రాల్లో ఐదు శాతం దరఖాస్తులపై దర్యాప్తు చేసే వెసులుబాటును కల్పించింది.
మృతుల కుటుంబీకులు పరిహారం కోసం దరఖాస్తు చేసుకునే కాల వ్యవధిని 30 రోజులే ఇవ్వాలనే కేంద్రం అభ్యర్థనపై సుప్రీం స్పందించింది. పరిహారం కోసం దరఖాస్తు చేసుకునే వ్యవధిని 60 రోజులుగా నిర్ణయించింది. భవిష్యత్లో సంభవించే కరోనా మరణాల విషయంలో ఆ వ్యవధిని 90 రోజులుగా పేర్కొంది. కరోనా మృతుల కుటుంబాలకు రూ.50,000 పరిహారం చెల్లింపులో అవకతవకలపై సుప్రీంకోర్టు గతంలోనే ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి చర్యలు అనైతికమైనవని పేర్కొంది. పరిహారం చెల్లింపు పారదర్శకంగా జరగడానికి అన్ని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలు నోడల్ అధికారిని నియమించాలని ఆదేశించింది.