కేసుల దర్యాప్తునకు అనుమతివ్వాలని కోరుతూ.. 2018 నుంచి ఈ ఏడాది జూన్ వరకు.. బంగాల్, మహారాష్ట్ర సహా 8 రాష్ట్రాలకు సీబీఐ పంపిన అభ్యర్థనలు పెండింగ్‌లోనే ఉండిపోవడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. సీబీఐ దర్యాప్తు చేస్తున్న పలు కేసులపై అప్పీలెట్ కోర్టులు స్టే విధించడాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించింది. ఈ పరిస్థితి ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది.
2018లో ఓ కేసుకు సంబంధించి జమ్ముకశ్మీర్ హైకోర్టు ఆదేశాలకు వ్యతిరేకిస్తూ.. సీబీఐ 542రోజులు ఆలస్యంగా అప్పీలు చేసుకుంది. ఇంత ఆలస్యం ఎందుకైంది? ప్రాసిక్యూషన్ బృందాన్ని బలోపేతం చేయడం, లోపాలు సరిదిద్దడం, దర్యాప్తు సంస్థ విచారిస్తున్న కేసుల్లో నేరస్థులను పట్టుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై అఫిడవిట్ దాఖలు చేయాలని సీబీఐ డైరక్టర్‌ను గతంలో ఆదేశించింది సర్వోన్నత న్యాయస్థానం. సంబంధిత అఫిడవిట్‌ను సుప్రీంకోర్టుకు సమర్పిస్తూ రెండు అంశాలను లేవనెత్తారు సీబీఐ డైరక్టర్. ఒకటి 8 రాష్ట్రాల్లో పెండింగ్‌లో ఉన్న అభ్యర్థనలు కాగా, మరొకటి.. సంస్థ దర్యాప్తు చేపట్టిన కేసులపై అప్పీలెట్ కోర్టులు స్టే విధించడం.
ఈ వ్యవహారంపై సోమవారం విచారణ చేపట్టింది జస్టిస్ ఎస్కే కౌల్, ఎంఎం సుంద్రేశ్‌తో కూడిన ధర్మాసనం. 2018- 2021 జూన్ మధ్య కాలంలో మహారాష్ట్ర, పంజాబ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, ఝార్ఖండ్, బంగాల్, కేరళ, మిజోరామ్ రాష్ట్రాలకు సీబీఐ 150 అభ్యర్థనలు పంపినట్టు గ్రహించింది.
"78శాతం కేసులకు సంబంధించి అభ్యర్థనలు రాష్ట్రాలకు పంపారు. ఈ కేసుల్లో దేశ ఆర్థికవ్యవస్థపై ప్రభావం చూపించే బ్యాంకు మోసాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ అభ్యర్థనలను పెండింగ్‌లో ఉంచడం సరైన విషయం కాదు."