దేశవ్యాప్తంగా 13 హైకోర్టులకు నూతన ప్రధాన న్యాయమూర్తులు రానున్నారు. ఈ మేరకు జస్టిస్ ఎన్.వి. రమణ(supreme court chief justice) నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం(sc collegium news).. కోల్‌కతా హైకోర్టు తాత్కాలిక సీజే జస్టిస్ రాజేశ్ బిందాల్ సహా ఎనిమిది మంది పేర్లను కేంద్రానికి సిఫార్సు చేసింది. మరో ఐదుగురు ప్రస్తుత సీజేలను బదిలీ చేయాలని ప్రతిపాదించింది.
16వ తేదీన జరిగిన కొలీజియం భేటీకి సంబంధించిన నిర్ణయాలను సుప్రీంకోర్టు వెబ్సైట్లో పొందుపరిచారు. సుప్రీంకోర్టు సిఫార్సులను కేంద్రం ఆమోదిస్తే.. జస్టిస్ రాజేశ్ బిందాల్.. అలహాబాద్ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించే అవకాశముంది. జస్టిస్ బిందాల్‌తో పాటు జస్టిస్ రంజిత్ వీ మోరే, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, జస్టిస్ ప్రకాశ్ శ్రీవాస్తవ, జస్టిస్ ఆర్.వి మలిమాత్, జస్టిస్ రితు రాజ్ అశ్వతి, జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా పేర్లను మేఘాలయ, తెలంగాణ, కోల్‌కతా, మధ్యప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులకు సీజేలుగా పదోన్నతి కోసం సిఫార్సు చేసింది సర్వోన్నత న్యాయస్థానం.
ఇదీ చూడండి:-'న్యాయవ్యవస్థలో భారతీయ స్ఫూర్తి ప్రతిబింబించాలి'
మరోవైపు జస్టిస్ ఎ.ఎ. ఖురేషీ(త్రిపుర హైకోర్టు సీజే), జస్టిస్ ఇంద్రజిత్ మహంతి(రాజస్థాన్ హైకోర్టు సీజే)ని రాజస్థాన్, త్రిపుర హైకోర్టుకు బదిలీ చేయాలని సిఫార్సు చేసింది కొలీజియం. మధ్యప్రదేశ్ సీజే జస్టిస్ మహమ్మద్ రఫీక్‌కు హిమాచల్ ప్రదేశ్ హైకోర్టుకు, మేఘాలయ సీజే బిశ్వంత్ సోమద్దర్ను సిక్కిం హైకోర్టుకు బదిలీ చేయాలని ప్రతిపాదించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీజే ఎ.కె. గోస్వామిని ఛత్తీస్‌గఢ్ హైకోర్టుకు బదిలీ చేయాలని సిఫార్సు చేసింది.