కొవిడ్ మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం అందించాలన్న పిటిషన్పై సర్వోన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. పరిహారానికి సంబంధించి ఎంత మొత్తం చెల్లించగలరో మార్గదర్శకాలు రూపొందించాలని అందులో పేర్కోంది. జస్టిస్ అశోక్ భూషన్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది.
కరోనా బలితీసుకున్న కుటుంబాలకు.. కనీసం ఉపశమనం కలిగించేందుకు ఎంతమొత్తం పరిహారం అందించాలో ఆరు వారాల్లో నిర్ణయించాలని.. జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీకి సూచించింది. నష్టం పరిహారం ఖరారు చేసేటపుడు అన్ని కోణాలను దృష్టిలో పెట్టుకోవాలని స్పష్టంచేసింది. జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.
బీమా పథకం..
ఫైనాన్స్ కమిషన్ ప్రతిపాదనల మేరకు విపత్తు కారణంగా మరణించే వారి కుటుంబ సభ్యుల కోసం బీమా పథకాన్ని రూపొందించాలని సుప్రీంకోర్టు కేంద్రానికి సూచించింది. అలాగే.. కరోనా కారణంగా మరణించిన వారిపై ఆధారపడిన కుటుంబసభ్యులకు ధృవీకరణ పత్రాలను మంజూరు చేసే ప్రక్రియను సరళతరం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.