మావోయిస్టులతో సంబంధాలు, దేశ ద్రోహ ఆరోపణలతో పాటు చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ)లోని నిబంధనల కింద అరెస్టు అయిన ఓ వ్యక్తిని ఆయా ఆరోపణల నుంచి విముక్తి చేస్తూ కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసింది. 2019 సెప్టెంబరులో కేరళ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులు.. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)చట్టంలోని నిబంధనలతో పాటు సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయని స్పష్టం చేసింది.
దేశ ద్రోహం కేసులో నిందితుడికి విముక్తి ఉత్తర్వు రద్దు
2019 సెప్టెంబరులో కేరళ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులు చెల్లవంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ)లోని నిబంధనల కింద అరెస్టు అయిన ఓ వ్యక్తిని ఆయా ఆరోపణల నుంచి విముక్తి చేస్తూ కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసింది.
హైకోర్టు తీర్పును కేరళ రాష్ట్ర ప్రభుత్వం, ఇతరులు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. దీనిపై జస్టిస్ ఎం.ఆర్.షా, జస్టిస్ ఎ. ఎస్. బోపన్నల ధర్మాసనం తీర్పు వెలువరిస్తూ హైకోర్టులోని ఇద్దరు సభ్యుల ధర్మాసనం రివిజన్ పిటిషన్‌పై విచారణ చేపట్టాలని ఆదేశించింది. తనపై మోపిన వివిధ అభియోగాలను కొట్టివేసేందుకు ప్రత్యేక కోర్టు తిరస్కరించడంతో నిందితుడు రూపేశ్... కేరళ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌ను విచారించిన ఏకసభ్య ధర్మాసనం అతనిపై నమోదైన అభియోగాలను కొట్టివేసింది. ఎన్‌ఐఏ చట్టంలోని సెక్షన్ 21లోని సబ్ సెక్షన్(2) నిబంధనలు, ఇటువంటి కేసుల్లో అనుసరించాల్సిన మార్గదర్శకాలంటూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం.. ఈ తరహా రివిజన్ పిటిషన్లపై హైకోర్టుల్లోని ద్విసభ్య ధర్మాసనాలు మాత్రమే విచారణ జరపాల్సి ఉంటుందని కేరళ ప్రభుత్వ తరపు న్యాయవాది సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. దీనికి విరుద్ధంగా ఏకసభ్య ధర్మాసనం విచారణ జరిపి ఇచ్చిన ఆదేశాలు చెల్లవని పెర్కొన్నారు. ఈ వాదనలతో ఏకీభవించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. నిందితుడికి ఉపశమనం కలిగిస్తూ ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
ఇదీ చదవండి:Abhinandan Varthaman: అభినందన్ వర్ధమాన్‌కు పదోన్నతి!