Justice Lalit: చిన్నారులు ఉదయం ఏడు గంటలకే పాఠశాలలకు వెళ్తున్నప్పుడు.. మనమెందుకు కాస్తముందుగా పని ప్రారంభించకూడదంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ అభిప్రాయపడ్డారు. నిర్ణీత కాలానికంటే ముందే ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం విధులు ప్రారంభించిన నేపథ్యంలో ఆయన్నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. ఆ ముగ్గురిలో ఈయన కూడా ఒకరు.
శుక్రవారం ఉదయం 9.30 గంటలకు జస్టిస్ లలిత్‌తో కూడిన ధర్మాసనం కేసు విచారణను ప్రారంభించింది. వాస్తవంగా కోర్టు పనిగంటలు 10.30కి ప్రారంభం అవుతాయి. ఇలా ముందుగా కార్యకలాపాలు ప్రారంభించడంపై అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జస్టిస్ లలిత్ స్పందిస్తూ.. 'చిన్నారులు ఉదయం ఏడు గంటలకే పాఠశాలలకు వెళ్తున్నప్పుడు.. న్యాయమూర్తులు, న్యాయవాదులు ఎందుకు ఉదయం తొమ్మిది గంటలకు తమ పని ప్రారంభించలేరు..? కోర్టులను ప్రారంభించడానికి ఇది సరైన సమయం. సుదీర్ఘ విచారణలు అవసరం లేనప్పుడు ఉదయం తొమ్మిది గంటలకు మన పని ప్రారంభించి, పదకొండున్నర తర్వాత అరగంట విరామం తీసుకోవాలి. అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు పని ముగించుకోవచ్చు. దీనివల్ల సాయంత్రం ఎన్నో పనులు చేసుకునే వెసులుబాటు ఉంటుంది.' అని అన్నారు.