తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'వైద్య సదుపాయాలపై సమగ్ర వివరాలివ్వండి' - covid-19

దేశంలో కరోనా విలయతాండవం చేస్తున్న క్రమంలో ఆక్సిజన్‌, టీకాలు, వైద్య సదుపాయాలపై గురువారం సాయంత్రం లోపు సమగ్ర వివరాలు తమకు అందించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనికి సంబంధించి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ లావు నాగేశ్వరరావు, జస్టిస్‌ రవీంద్రభట్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం.. 12 పేజీల లిఖిత పూర్వక ఉత్తర్వులు జారీ చేసింది.

sc
సుప్రీంకోర్టు

By

Published : Apr 29, 2021, 5:14 AM IST

Updated : Apr 29, 2021, 6:14 AM IST

దేశవ్యాప్తంగా నెలకొన్న కొవిడ్‌ పరిస్థితులపై సుమోటోగా విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. మహమ్మారిపై పోరులో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదాలకు దారితీస్తున్న వివిధ అంశాలపై సమగ్ర సమాచారాన్ని తెలుసుకోగోరింది. దీనికి సంబంధించి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ లావు నాగేశ్వరరావు, జస్టిస్‌ రవీంద్రభట్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం 12 పేజీల లిఖిత పూర్వక ఉత్తర్వులు జారీ చేసింది.

"ప్రజల్లో ప్రస్తుతం నెలకొన్న ఆందోళనలను తొలగించడానికి, మహమ్మారితో చేస్తున్న పోరాటంతో పాటు ఇతరత్రా తీసుకుంటున్న చర్యల గురించి అధికారిక సమాచారాన్ని వెల్లడించడానికి కేంద్ర ప్రభుత్వం వైద్యనిపుణుల కమిటీని నియమించాలి. ఈ బృందం ద్వారా రోజు వారీగా వివరాలు వెల్లడించాలి. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించే విధానాన్ని ప్రతి రాష్ట్రం అనుసరించాలి. దీనివల్ల అధీకృత సమాచారం తెలుసుకోవడానికి వీలవుతుంది."

-- సుప్రీంకోర్టు ధర్మాసనం

'మహమ్మారి నుంచి ఎదురవుతున్న తీవ్ర ఇబ్బందులను తొలగించాలంటే ప్రాదేశిక సరిహద్దులకు అతీతంగా ఉన్న విషయాల్లో సమగ్ర పంథా అనుసరించాల్సి ఉంటుంది. ఆ స్పృహతోనే సుప్రీంకోర్టు అధికరణం 32లో పేర్కొన్న అధికారాలను ఉపయోగించింది' అని తెలిపింది.

వివిధ అంశాలపై ఉత్తర్వులు..

  • ఆక్సిజన్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వం కింద పేర్కొన్న అంశాలపై కోర్టుకు వివరణ ఇవ్వాలి
  • ప్రస్తుత పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా ఆక్సిజన్‌కు ఉన్న డిమాండ్‌ ఎంత? భవిష్యత్తు అవసరాలపై అంచనా ఏమిటి?
  • ఇప్పటి వరకు తీసుకున్న చర్యలేంటి? ఇప్పుడున్న డిమాండ్‌తో పాటు భవిష్యత్తులో తలెత్తే డిమాండ్‌కు అనుగుణంగా ఆక్సిజన్‌ లభ్యతను పెంచడానికి తీసుకోబోతున్న చర్యలు ఏమిటి?
  • ఆక్సిజన్‌ సరఫరా పర్యవేక్షణ కోసం ఎటువంటి యంత్రాంగం ఉంది? మరీ ముఖ్యంగా సంక్లిష్టమైన రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అవసరాలు, ఇతర రాష్ట్రాల అవసరాలు తీర్చడానికి ఏం చేశారు?
  • కేంద్ర వాటా నుంచి ప్రస్తుతం ఏ ప్రాతిపదికన ఆక్సిజన్‌ కేటాయిస్తున్నారు?
  • రాష్ట్రాలు తమ అవసరాలను రోజు వారీగా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాయి. దాని ప్రకారం వాటి అవసరాలను రోజువారీగా తీరుస్తున్నారా?
  • పడకల లభ్యత, కొవిడ్‌ చికిత్స కేంద్రాల్లాంటి కీలకమైన మౌలికవసతుల పెంపునకు ఏం చర్యలు తీసుకున్నారు? తగినంత వైద్య సిబ్బందిని నియమించారా? భవిష్యత్తులో ఎంత మేరకు వైద్య సిబ్బంది అవసరమవుతారు?
  • ఆసుపత్రులు, కొవిడ్‌ కేర్‌సెంటర్లలో రోగులను చేర్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఏమైనా ప్రత్యేక ప్రమాణాలు, నిబంధనలు రూపొందించిందా? రోగులను చేర్చుకోవడానికి అనుసరించే విధానాలేంటి?
  • రెమ్‌డెసివిర్‌, ఫావిపిరవిర్‌తో పాటు వైద్యులు సూచించే ఇతర మందులు అందుబాటులో ఉంచడానికి ఇప్పటి వరకు తీసుకున్న చర్యలేంటి? అత్యవసర మందుల ధరలను నియంత్రించడానికి, అక్రమ నిల్వలను అరికట్టడానికి అనుసరిస్తున్న విధివిధానాలేంటి?

వ్యాక్సినేషన్‌ విషయంలో...

  1. ఇప్పటి వరకు 45 ఏళ్ల పైబడిన వారికి పరిమితమైన వ్యాక్సినేషన్‌ కార్యక్రమం మే 1 నుంచి 18-45ఏళ్ల మధ్యలోని వారికీ అందుబాటులోకి వస్తోంది. అందువల్ల కేంద్ర ప్రభుత్వం కొన్ని విషయాల్లో స్పష్టత ఇవ్వాలి.
  2. వ్యాక్సినేషన్‌ విస్తృతిని పెంచినందున ఎంతమేర టీకాలు అవసరం అవుతాయని అంచనా వేస్తున్నారు?
  3. ప్రస్తుతం ఉన్న టీకాల కొరతను అధిగమించడానికి తీసుకున్న చర్యలేంటి?
  4. విదేశాల నుంచి ఎంతమేర టీకాలు సేకరిస్తున్నారు? వ్యాక్సిన్‌ లభ్యతను పెంచడానికి అది ఎంతవరకు దోహదం చేస్తుంది?
  5. ఇప్పటికే తొలి డోసు తీసుకన్న 45 ఏళ్ల పైబడిన వారికి రెండో డోసు అందించడానికి తీసుకుంటున్న చర్యలేంటి?
  6. 18-45 ఏళ్ల వయస్సులోని వారికి వ్యాక్సిన్‌ అందించడానికి అనుసరిస్తున్న విధివిధానాలేంటి?
  7. ఒకవేళ ప్రతి రాష్ట్రం నేరుగా వ్యాక్సిన్‌ ఉత్పత్తిదారులతో బేరసారాలు మొదలుపెడితే, రాష్ట్రాలకు వ్యాక్సిన్‌లు ఎలా కేటాయిస్తారు?
  8. కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌లు కాకుండా సేకరిస్తున్న ఇతర వ్యాక్సిన్లేంటి? అందుకు అనుసరించే కాలపరిమితి ఏంటి? ఈ అఫిడవిట్‌ ప్రతులను ఈ కేసులో హాజరైన అన్ని పక్షాల న్యాయవాదులతో పంచుకోవాలి.
  9. వ్యాక్సిన్ల ధరల నిర్ణయానికి ప్రాతిపదిక, హేతుబద్ధత ఏంటి? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సేకరించే వ్యాక్సిన్ల ధరలు వేర్వేరుగా ఉండటానికి కారణమేంటి?
  10. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దాఖలుచేసిన అఫిడవిట్‌లో పైన పేర్కొన్న అంశాలేమీ లేవు. అందువల్ల తదుపరి కేసు విచారణ లోపు ఈ వివరాలన్నింటితో అఫిడవిట్‌ దాఖలుచేయాలి.
  11. రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు కూడా ఏప్రిల్‌ 29న సాయంత్రం 6 గంటల్లోపు తమ స్పందన తెలపాలి. పైన పేర్కొన్న వివరాల ప్రకారం రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఉన్న మౌలికవసతుల గురించి వెల్లడించాలి..
  12. తాము కోరిన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తే పరిస్థితిని అర్థం చేసుకొని, ఎక్కడ లోపాలున్నాయో తెలుసుకోవడం కోర్టుకు సులభమవుతుంది. ఆ లోపాలను కేంద్ర ప్రభుత్వం దిద్దాల్సి ఉంటుంది.

ఇదీ చదవండి :భారత్‌- చైనా రోడ్డు ప్రాజెక్టు అధిపతిగా మహిళాధికారి

Last Updated : Apr 29, 2021, 6:14 AM IST

ABOUT THE AUTHOR

...view details