జంతువులపై క్రూరత్వం నిరోధక చట్టానికి సంబంధించి 2017లో నోటిఫై చేసిన నిబంధనలు ఉపసంహరించుకోవాలని లేదా మార్పులు చేయాలని సుప్రీంకోర్టు కేంద్రానికి సూచించింది. జంతువులను తరలిస్తూ పట్టుబడ్డవారు విచారణ ఎదుర్కొంటున్న సమయంలోనే గోవులను గోశాలలకు తరలించడం చట్ట విరుద్ధమని పేర్కొంది. కొందరికి జంతువులే జీవనోపాధి అని పేర్కొంది. దోషిగా తేలక ముందే నిందితుల నుంచి జంతువులను ప్రభుత్వం జప్తు చేయకూడదని పేర్కొంది.
ఒకవేళ కేంద్రం 2017లో నోటిఫై చేసిన నిబంధనలను వెనక్కి తీసుకోకపోతే చట్ట ప్రకారం ప్రభుత్వం వ్యాపారులు, నిందితుల నుంచి గోవులను జప్తు చేయడానికి వీల్లేదని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది.
ఈ కేసులో కేంద్రం తరఫున వాదనలు వినిపించారు సోలిసిటర్ జనరల్ జయంత్ కే సూద్. జంతువులను చంపుతున్నందునే 2017లో నిబంధనలు నోటిఫై చేసినట్లు సుప్రీంకోర్టుకు తెలిపారు.
అయితే జంతువులు ఎంతో మంది జీవనోపాధికి మూలం అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. పెంపుడు శునకాలు, పిల్లుల గురించి తాము మాట్లాడటం లేదని పేర్కొంది. జంతువులపై ఆధారపడే కొందరు జీవిస్తారని చెప్పింది. 2017లో నోటిఫై చేసిన నిబంధనలు చట్టానికి విరుద్ధంగా ఉన్నాయంది. దోషిగా తేలే వరకు ఎవరి నుంచి జంతువులను జప్తు చేయొద్దని స్పష్టం చేసింది. తదుపరి విచారణను జనవరి 11కు వాయిదా వేసింది.