ట్రైబ్యునళ్లలో ఖాళీలను భర్తీ చేయకపోవడంపై కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు (Tribunals Supreme Court) మరోసారి అసంతృప్తి వెళ్లగక్కింది. సుప్రీం ఆదేశాలతో కేంద్ర ప్రభుత్వం ఖాళీల భర్తీ ప్రక్రియను ప్రారంభించినా.. సర్కారు తీరులో ఏ మాత్రం మార్పు లేదని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఖాళీలను భర్తీ చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ డీవై. చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. ఖాళీల భర్తీ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీరు సంతృప్తికరంగా లేదని జస్టిస్ రమణ వ్యాఖ్యానించారు. ఆలస్యానికి కరోనా సహా అనేక కారణాలు చెబుతున్నారని, ఖాళీల భర్తీ, సభ్యుల ఎంపిక విధానం కూడా అర్థం కావడం లేదని అన్నారు. మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామని గుర్తు చేశారు.
విచారణ సందర్భంగా జస్టిస్ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం మరికొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. న్యాయపాలన.. రాజ్యాంగ నిబంధనలకు లోబడి ఉండాలని, ఒక ఏడాది పని చేయడానికి జ్యుడీషియరీ నుంచి ఎవరైనా వస్తారా అని జస్టిస్ రమణ ప్రశ్నించారు. భర్తీ ఆలస్యంతో ఖాళీల సంఖ్య పెరుగుతుందని గుర్తు చేశారు. ట్రైబ్యునళ్ల ఖాళీల భర్తీలో ప్రతిసారీ ఇలాగే ప్రవర్తిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. విచారణ సమయంలో కేంద్రానికి ఏదో ఒకటి చెప్పడం అలవాటైందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సమస్యలు అందరికీ తెలుసు అని, కావలసింది పరిష్కారమే అని జస్టిస్ రమణ అన్నారు. ప్రభుత్వం నియామకాలు చేపట్టడం ఒక్కటే సమస్యకు పరిష్కారం అని స్పష్టం చేశారు.