సామాజిక వంటశాలల (Community Kitchens In India) ఏర్పాటుపై దేశవ్యాప్తంగా ఏకరూప విధానాన్ని రూపొందించడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందడం పట్ల భారత అత్యున్నత న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. వీటిపై ఉమ్మడి పథకం రూపొందించడంలో కేంద్రం నిర్లక్ష్యం వహిస్తోందని.. వీలైనంత త్వరలో కమ్యూనిటీ కిచెన్లు ఏర్పాటు చేయాలని సూచించింది. దేశంలో కమ్యూనిటీ కిచెన్ల ఏర్పాటుపై మరోసారి విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ప్రజలు ఆకలితో చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి సమయంలో వారికి ఆహారం అందించడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేసింది. ఈ అంశంపై రాష్ట్రాలతో చర్చించి మూడువారాల్లో సమగ్ర ప్రణాళిక రూపొందించాలని.. లేదంటే తామే ఆదేశాలు ఇస్తామని సుప్రీంకోర్టు కేంద్రాన్ని హెచ్చరించింది.
ఇదే చివరి హెచ్చరిక..
ఆకలితో అలమటిస్తోన్న వారికి ఆహారం అందించేందుకు దేశవ్యాప్తంగా సామాజిక వంటశాలలు (Community Kitchens In India) ఏర్పాటు చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాంటూ దాఖలైన పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన 17 పేజీల అఫిడవిట్‌పై చీఫ్ జస్టిస్ ఎన్.వి.రమణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇందులో కేవలం సమాచారం మాత్రమే ఉందని.. పథకం రూపకల్పనకు సంబంధించిన విషయాలేవీ లేవని పేర్కొన్నారు. కేవలం పోలీసుల మాదిరిగా సమాచారం సేకరించడం కాదని.. పథకం అమలుపై రాష్ట్రాలతో చర్చించాలని కేంద్రానికి చురకలంటించారు. మేము అడిగిన దానికి.. మీరు ఇచ్చిన సమాచారానికి పొంతన లేదన్న చీఫ్ జస్టిస్.. ఇదే మీకు చివరి హెచ్చరిక అని కేంద్రానికి స్పష్టం చేశారు.