చార్‌ధామ్ రోడ్డు విస్తరణకు, ఇటీవల ఉత్తరాఖండ్‌లో సంభవించిన ఆకస్మిక వరదలకు సంబంధం లేదని కేంద్రం బుధవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఇటీవల ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలో సంభవించిన ఆకస్మిక వరదల్లో అనేక మంది గల్లంతయ్యారు. కొందరు అక్కడ ఉన్న సొరంగాల్లో చిక్కుకుపోగా సహాయక చర్యలు జరుగుతున్నాయి. దీనిపై సుప్రీంకోర్టు నియమించిన కమిటీ వెల్లడించిన వివరాల ప్రకారం.. నాలుగు పుణ్యక్షేత్రాలైన గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్‌లను కలుపుతూ 900 కిలోమీటర్ల చార్‌ధామ్ హైవే ప్రాజెక్టు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ రోడ్డు విస్తరణ కారణంగానే ఆకస్మిక వరదలు సంభవించాయని ఆ కమిటీ పేర్కొంటూ కేంద్రానికి లేఖ పంపింది.
కేంద్ర రక్షణ శాఖ తరఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ఉత్తరాఖండ్‌లో రోడ్ల విస్తరణకు, ఇటీవల సంభవించిన వరదలకు ఏ విధమైన సంబంధం లేదన్నారు. ఈ అంశంపై స్పందించేందుకు కొంత సమయం కావాలని ఆయన కోర్టుకు విజ్ఞప్తి చేశారు. జస్టిస్ రోహిన్‌టన్, జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ బీఆర్ గవాయ్‌లు సభ్యులుగా ఉన్న ధర్మాసనం ఈ మేరకు కేంద్రానికి రెండు వారాల గడువిచ్చింది.