నారదా కేసులో కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేసిన అప్పీల్‌ను ఉపసంహరించుకునేందుకు సీబీఐకి అనుమతించింది సుప్రీం కోర్టు. హైకోర్టులోనే తేల్చుకోవాలని స్పష్టం చేసింది సర్వోన్నత న్యాయస్థానం.
ఈ కేసులో ముగ్గురు తృణమూల్ కాంగ్రెస్ నేతలు సహా మరో నేతను గృహనిర్బంధంలో ఉంచేందుకు కలకత్తా హైకోర్టు ఆదేశాలివ్వటాన్ని సుప్రీం కోర్టులో సవాల్ చేసింది సీబీఐ.
సీబీఐ అప్పీల్‌ను పరిశీలించిన జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ బీఆర్ గవాయ్‌లు సభ్యులుగా గల సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. నారదా కేసులో కలకత్తా హైకోర్టులోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇప్పటికే విచారణ చేపట్టినట్లు స్పష్టం చేసింది. తమ అప్పీల్‌ను వెనక్కి తీసుకునేందుకు సీబీఐ తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు అనుమతించింది. ఎలాంటి సమస్యలున్నా హైకోర్టు దృష్టికి తీసుకెళ్లాలని స్పష్టం చేసింది. బంగాల్ ప్రభుత్వం, కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలు తమ వాదనలు వినిపించేందుకు స్వేచ్ఛ ఉంటుందని తెలిపింది.