తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సుప్రీంకు చేరిన 'అదానీ' వ్యవహారం.. శుక్రవారమే విచారణ

దేశంలో తీవ్ర దుమారానికి దారితీసిన అదానీ గ్రూప్‌ వ్యవహారంపై దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. దీనిపై శుక్రవారం విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది.

supreme court on Adani Hindenburg Research Report
సుప్రీం కోర్టు

By

Published : Feb 9, 2023, 1:09 PM IST

అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్‌ ఇచ్చిన నివేదికపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. దీనిపై శుక్రవారం విచారణ జరపనున్నట్లు పేర్కొంది. అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలపై విశ్రాంత సుప్రీంకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో కమిటీ ఏర్పాటు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని న్యాయవాది విశాల్ తివారీ పిటిషన్‌ దాఖలు చేశారు.

తన పిటిషన్​పై అత్యవసర విచారణ చేపట్టాలని సీజేఐ జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్ ధర్మాసనం ముందు విశాల్​ తివారీ అభ్యర్థించారు. ఇదే అంశంపై శుక్రవారం రానున్న మరిన్ని పిటిషన్లను కలిపి విచారణ జరపాలని కోరారు. పెద్ద కార్పొరేట్లకు ఇచ్చిన రూ.500 కోట్లకుపైగా రుణాలను పర్యవేక్షించడానికి ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసేలా ఆదేశాలివ్వాలని విన్నవించారు. న్యాయవాది విశాల్​ తివారీ పిటిషన్‌ను స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం.. దీనిపై శుక్రవారం విచారణ జరుపుతామని తెలిపింది.

అదానీ గ్రూప్​పై సంచలన నివేదిక ఇచ్చి ఆ సంస్థ మార్కెట్‌ విలువ పతనానికి కారణమైన హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ సంస్థ యజమాని నాథన్‌ అండర్సర్‌, అతడి అనుచరులపై దర్యాప్తునకు ఆదేశించాలని సీనియర్‌ న్యాయవాది ఎంఎల్‌ శర్మ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై కూడా శుక్రవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది.

అదానీ గ్రూప్ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని, ఖాతాల్లోనూ మోసాలు చేస్తోందంటూ.. గతవారం హిండెన్‌బర్గ్‌ ఇచ్చిన నివేదిక తీవ్ర దుమారానికి దారితీసింది. అయితే ఈ ఆరోపణలను అదానీ గ్రూప్‌ తీవ్రంగా ఖండించింది. కాగా, ఈ నివేదిక నేపథ్యంలో ఇటీవల అదానీ సంస్థకు చెందిన కంపెనీల షేర్లు భారీగా పతనమయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details